రాజధానిపై ఇదీ జగన్‌ ప్లాన్‌ !

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా అనే అయోమయానికి జగన్‌ తనదైన శైలిలో చెక్‌ పెట్టారు. తన ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత రాజధాని పనులు కొనసాగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించిన ఐకానిక్‌ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలు మాత్రం అక్కడ ఉండవని తేల్చేశారు. రాజధాని అమరావతే కానీ అత్యంత కీలకమైన నిర్మాణాలు మాత్రం అక్కడ ఉండవని స్పష్టమైంది.

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం ఆగిపోయింది. రాజధాని దొనకొండకు, హైకోర్టు కర్నూలుకు తరలిపోతుందనే ప్రచారం జరిగింది. దీనికితోడు మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్లతో రాజధాని అమరావతి గల్లైంతనట్లేననే ఆందోళన వ్యక్తమైంది. కానీ జగన్‌ వ్యూహం వేరేలా ఉంది. అమరావతి అంతా చంద్రబాబు మనుషులు, బినామీలతో నిండిపోయి ఉంది. దాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదు. కానీ రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకోవడం, వారికి తిరిగి ప్లాట్లు ఇవ్వాల్సివుండడం అనివార్యం కావడం, సగానికిపైగా పూర్తయిన నిర్మాణాలుండడం వల్ల రాజధానిని వేరే చోటుకు మార్చితే తీవ్ర ప్రతిఘటన తప్పదు. పైగా ప్రజల్లోకి రాంగ్‌ సిగ్నల్‌ వెళతాయనే అనుమానం ఉంది. అందుకే రైతులకివ్వాల్సిన ప్లాట్లు ఇవ్వడం, సగానికిపైగా పూర్తయిన నిర్మాణాలు పూర్తి చేయడానికి అంగీకరించారు. దీంతో రాజధాని ఇక్కడే ఉంటుందని సంకేతాలిచ్చి అభివృద్ధి ఆగిపోతుందనే ప్రచారం చేసే వాళ్ల నోళ్లకు తాళం వేశారు.

ప్రస్తుతానికి వెలగపూడిలోనే సచివాలయం, అసెంబ్లీ, సమీపంలోనే ఉన్న హైకోర్టులోను యథాతథంగా కొద్దిరోజులు కొనసాగించనున్నారు. నెమ్మదిగా సచివాలయాన్ని నాగార్జున యూనివర్సిటీ సమీపానికి తరలించాలనేది ప్రభుత్వ వ్యూహం. ఆ తర్వాత అసెంబ్లీ కూడా అక్కడే కొలువు తీరుతుంది. మంగళగిరి ప్రాంతం తమకు అనువుగా ఉంటుంది, జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది, రాజధాని పరిధిలోనే ఉంటుందని కాబట్టి పెద్దగా అభ్యంతరాలు ఉండవు. ఈ ప్లాన్‌లో రాజధాని కేంద్ర స్థానం మంగళగిరి అవుతుంది. చంద్రబాబు కడతామని చెప్పిన రాజధాని కేంద్ర స్థానం (కోర్‌ ఏరియా) అమరావతిలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత రాయలసీమ హక్కుల రక్షణ కోసం హైకోర్టును నెమ్మదిగా కర్నూలుకు మార్చినా ఎటువంటి అభ్యంతరం ఉండదనేది జగన్‌ ప్లాన్‌. దీనివల్ల అమరావతి చంద్రబాబుదనే భ్రమ తొలగి తన చేతిల్లోకి వస్తుందనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.