మాజీ మంత్రి  తప్పు దిద్దుకుంటున్నారా ?

చూడబోతు అలేగే ఉంది ఈ మాజీ మంత్రి  వ్యవహారం. ప్రస్తుతం జనసేనలో ఉన్న ఈ నేత తొందరలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి  వైసిపిలో చేరాలని డిసైడ్ అయ్యారట.   నిజానికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మొన్నటి ఎన్నికలకు ముందే వైసిపిలో చేరాల్సింది. కానీ ఎందుకనో జనసేనలో చేరిపోయారు. అంతకుముందు కాంగ్రెస్ లోనే రెండుసార్లు ఎంఎల్ఏగా ఒకసారి మంత్రిగా కూడా చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత కూడా బాలరాజు కాంగ్రెస్ లోనే ఉన్నారు. హస్తంపార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదన్న ఉద్దేశ్యంతోనే వైసిపిలో చేరాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే కొందరు సన్నిహితులు జగన్మోహన్ రెడ్డితో ఈ విషయం మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో మంచి పట్టున్న పసుపులేటి వైసిపిలో చేరటానికి ముహూర్తం కూడా రెడీ అయ్యింది.

కానీ తర్వాత ఏమైందో ఏమో. వైసిపిలో చేరాల్సిన బాలరాజు జనసేనలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. సరే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమైందో అందరూ చూసిందే. కాబట్టి బాలరాజు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుండి చాలామంది లాగే బాలరాజు కూడా పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరు.

అలాంటిది విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి నియోజకరవర్గంలో తన మద్దతుదారులతో బాలరాజు సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ మార్పు విషయమై పెద్ద చర్చే జరిగింది. దాంతో బాలరాజు జనసేనకు గుడ్ బై చెప్పటం ఖాయమని తేలిపోయింది. మంచి ముహూర్తం చూసుకుని తొందరలోనే వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. జగన్ కూడా బాలరాజు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే అప్పుడు చేసిన ఖరీదైన తప్పును బాలరాజు ఇపుడు సరి చేసుకుంటున్నారన్నమాట.