ఎపి శాసన మండలి తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నాడు. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం పై తాజాగా మంత్రులు, న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఒకవైపు అసెంబ్లీ జరుగుతన్న సమయంలో మంత్రులు, సీనియర్ నేతలతో జగన్ కీలక భేటీ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ సమావేశంలో మంత్రుల అభిప్రాయాలను తీసుకున్న జగన్ కొందరు మంత్రుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వానికి మండలిలో విలువ లేకుండా చేశారనే భావనతో మండలిని ఏకంగా రద్దు చేసే ఆలోచనలో జగన్ ఉన్నాడని, ఈ తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అయినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడని, ఈ రోజే అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని తాజా న్యూస్.
అయితే మండలిని రద్దు చేయాలన్న విషయం పై అటు జగన్ తో మంత్రులు వాదోపవాదాలు కూడా చేసారని తెలిసింది. ఎవరేమి అనుకున్నా సరే జగన్ మాత్రం ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాడని అంటున్నారు. అయితే రానున్న రోజుల్లో వైసిపి కి మండలిలో ఆధిక్యం వస్తుందని, ఇప్పుడు రద్దు చేస్తే రాజకీయ కక్షతో చేసినట్టు అవుతుందని అందులోనూ చాలా న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రభుత్వ బిల్లుకు విలువ ఇవ్వకుండా, పార్టీ అభిప్రాయాన్ని ఖరారు చేయకుండా చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో జగన్ చాలా సీరియస్ గా ఉన్నాడని, అందుకే మండలిని రద్దు చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.