బొబ్బిలి కోట పై బొత్స గురి

సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి వంశానికి చెందిన ఈ తరం రాజకీయ నాయకుడు. 2004 2009 లో కాంగ్రెస్ తరఫున గెలిచిన సుజయ్ కృష్ణ 2014లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగారు. అయితే   టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సుజయ్ కృష్ణ తెలుగుదేశంలో చేరి మంత్రి అయ్యారు. మంత్రి పదవి కోసం వెళ్లారో లేకుంటే బొత్స సత్యనారాయణ వైసీపీ లో చేరడం వల్ల అసంతృప్తితో వెళ్లారో స్పష్టంగా తెలియనప్పటికీ సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ వీడటం అప్పట్లో వైసిపికి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.

సుజయ కృష్ణ పార్టీ వీడడంతో బొత్స హవాకి ఎదురు లేకుండా పోయింది. అదే సందర్భంలో బొత్స కూడా తన వల్ల జరిగిన నష్టాన్ని ఎలాగైనా భర్తీ చేయాలని పట్టుదలగా పనిచేసి బొబ్బిలి నియోజకవర్గంతో పాటు మొత్తానికి విజయనగరం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారు. సుజయ్ కృష్ణ రంగారావు దాదాపు 10 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బొత్స సత్యనారాయణ జిల్లాపై తనకున్న పట్టును మరొకసారి చాటడం తోపాటు రాజులు పై పైచేయి సాధించడం జరిగింది.

త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బొబ్బిలి మున్సిపాలిటీ ని కైవసం చేసుకొని రాజులను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని బొత్స తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా తన మేనల్లుడు చిన్న శ్రీను ఒకవైపు తూర్పు కాపులను ఒకవైపు ఎమ్మెల్యే అప్పలనాయుడు కొప్పుల వెలమలను మరోవైపు దువ్వుతున్నారు.  నోటిఫికేషన్ రాకుండానే ప్రజల్ని కలుస్తూ దూసుకెళ్తున్నారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు బొబ్బిలిని  కేంద్రంగా చేసుకుంటూ పార్టీని ప్రజలకి మరింత దగ్గర చేస్తున్నారు. సుజయ కృష్ణ కి ప్రజల మద్దతు ఉన్నప్పటికీ బొత్స సత్యనారాయణ తన మేనల్లుడు చిన్న శ్రీను వేస్తున్న మాస్ వ్యూహాలను తన క్లాస్ రాజకీయాలతో ఎదుర్కోలేక పోతున్నారు. రాజులు పోయిన ఎన్నికల్లో  ఓడిపోయారని ప్రజల్లో సుజయ్ కృష్ణ కుటుంబంపై కొంత సానుభూతి కూడా ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో బొబ్బిలి మున్సిపాలిటీ లో పోటీ రసవత్తరంగా ఉండబోతుంది

Sujaya Krishna Ranga Rao of Bobbili Dynasty