బొబ్బిలి రాజు కథ రివర్సేనా ?

చరిత్రలో ఎంత ప్రసిద్ది చెందిన బొబ్బిలి రాజుల వంశానికి చెందిన ఫిరాయింపు మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. మొదటిసారిగా సుజయ 2004లో దివంగ సిఎం వైఎస్సార్ చలవ వల్ల బొబ్బిలి నియోజకవర్గానికి ఎంఎల్ఏ అయ్యారు. తర్వాత 2009లో కూడా రెండోసారి ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత వైఎస్ హఠాత్తుగా మరణించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో  జగన్మోహన్ రెడ్డి  కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేసి వైసిపి పెట్టుకున్నారు.

మూడోసారి జగన్ పార్టీ తరపున ముచ్చటగా మళ్ళీ గెలిచారు. అయితే వైసిపి తరపున గెలిచిన సుజయ హఠాత్తుగా టిడిపిలోకి ఫిరాయించేశారు. ఫిరాయించటమే కాకుండా ఏకంగా మంత్రికూడా అయిపోయారు. పార్టీ ఫిరాయించినందుకు సుజయ మీద స్ధానిక జనాలు బాగా మండిపోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే మంత్రి అయినందుకు అభివృద్ధి కార్యక్రమాలేమన్నా చేశారా అంటే అదీలేదు. పైగా గనులు, ఇసుక అక్రమ తవ్వకాల్లో కోట్లాది రూపాయల వెనకేసుకున్నారనే ఆరోపణలు బోనస్.

తాను నివాసముంటున్న బొబ్బిలి పట్టణాన్నయినా డెవలప్ చేశారా అంటే దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇటు వైసిపి నేతలు, శ్రేణులకు దూరమై అటు టిడిపి నేతల్లో కూడా అందరినీ కలుపుకుని వెళ్ళలేదు. తనకు కావాల్సిన కొద్దిమందితో పాటు బంధువులను మాత్రమే అన్నీ రకాలుగా ఆదుకున్నారనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. దాంతో సుజయపై టిడిపిలో కూడా చాలామంది మద్దతు ఇవ్వటం లేదట.

అదే సమయంలో వైసిపి తరపున పోటీ చేస్తున్న సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రజా వ్యతరేకతకు తోడు సంబంగికి అన్నీ వైపుల వస్తున్న మద్దతు వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంటోంది. జనసేన నుండి గిరిదా అప్పలస్వామి కూడా పోటీలో ఉన్నారంటే ఉన్నారంతే. మొత్తం మీద వైఎస్ కుటుంబం చలవతో మూడుసార్లు గెలిచిన సుజయ నాలుగోసారి దెబ్బతినటం ఖాయమనే అంటున్నారు.