సుజనా పై ఇన్ సైడర్ బాంబు పేల్చిన బొత్స

కేంద్ర మాజీ మంత్రి టిడిపి ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరిపై బొత్సా సత్యనారాయణ పెద్ద బాంబే పేల్చారు. రాజధాని ప్రాంతంలో సుజనా కుటుంబసభ్యులకు పెద్ద ఎత్తున భూములున్నాయంటూ బొత్స చెప్పిన వివరాలు సంచలనంగా మారాయి. గడచిన నాలుగు రోజులుగా ఇద్దరి మధ్య రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వివాదం తీవ్రస్ధాయిలో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

రాజధాని ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని సుజనా చెప్పారు. దానికి బొత్స కౌంటర్ ఇచ్చినా సుజనా వెనక్కు తగ్గలేదు. దమ్ముంటే తన ఆరోపణలను మంత్రి నిరూపించాలంటూ సుజనా చాలెంజ్ చేశారు. దాంతో బొత్సా కొన్ని వివరాలను శాంపుల్ గా బయటపెట్టారు.

బొత్స బయటపెట్టిన వివరాల ప్రకారం చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల గ్రామంలో కళింగ గ్రీన్ టెక్ కంపెనీకి  110 ఎకరాలున్నట్లు చెప్పారు. ఈ కంపెనీ సుజనా సోదరుడు యలమంచిలి జితన్ కుమార్ ది. అలాగే సోదరుని కూతురు యలమంచిలి రుషికన్యకు వీరులపాడు మండలంలోని గోకరాజుపాలెంలో 14 ఎకరాలున్నట్లు చెప్పారు.

అలాగే చంద్రబాబునాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి ఎకార లక్ష రూపాయల చొప్పున 493 ఎకరాలు కట్టబెట్టారట. ముందు ఏపిఐఐసి భూములను కేటాయించినా తర్వాత సదరు భూములను సిఆర్డిఏ పరిధిలోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు. ఇపుడా భూముల ఖరీదు సుమారు రూ. 2 వేల కోట్లని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతోంది. మొత్తానికి ఇంకా ఎంతమంది తమ్ముళ్ళు రాజధాని వల్ల లాభపడ్డారో తొందరలోనే మరో లిస్టు వచ్చేట్లే ఉంది. బొత్స బయటపెట్టిన వివరాలకు సుజనా ఏం మాట్లాడుతారో చూడాలి.