సొంత పార్టీ నేతలపైనే వైసీపీ నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ‘బొచ్చులో న్యాయకత్వం.. ఎవడికి కావాలి మీ నాయకత్వం’ అంటూ చేసిన వ్యాఖ్యలకు తాలుకా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో రఘురామ కృష్ణం రాజు వ్యవహారశైలిపై మరోసారి ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్ యార్డు ఛైర్మన్ ఎంపిక వ్యవహారంలో స్థానికంగా విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ విషయంలో వైసీపీలోని రెండు వర్గాలు తమ వారికి అంటే తమ వారికి ఛైర్మన్ సీటు ఇవ్వాలని కోరడంతో అంతర్గతంగా వివాదం రేగింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న రఘురామ కృష్ణం రాజు కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. మంత్రి మోపీదేవితో చర్చించి వివాదాలు లేకుండా ఛైర్మన్ ఎంపిక పూర్తి చేస్తామని అన్నారు.
ఇక్కడే ఎంపీ మాట్లాడుతుండగా.. అక్కడ ఉన్న కార్యకర్తలు.. జై జగన్, జగన్ నాయకత్వం వర్దిల్లాలి, రఘురామ కృష్ణం రాజు నాయకత్వం వర్థిల్లాలి అని నినాదాలు చేశారు. అందులో ఓ కార్యకర్త మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వ వర్థిల్లాలి అని నివాదం ఇవ్వడంతో ఎంపీ అసహనానికి లోనయ్యారు. ఎవడి నాయకత్వం కావాలి.. బొచ్చులో నాయకత్వం.. నోరు మూసుకుని కూర్చోండి.. అంటూ మండిపడ్డారు. గతంలోనూ ప్రొటోకాల్ విషయంలో, ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఘటనలోనూ ఈ ఎంపీ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి సొంత పార్టీ కార్యకర్తలపైనై ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.