ఫిరాయింపు ఎంపిలపై ప్రధానికి ఫిర్యాదు

బిజెపిలోకి ఈమధ్యనే ఫిరాయించిన టిడిపి రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరిపై ఏపి బిజెపి నేతలు మండిపోతున్నారు. టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ ఎంపిల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. బిజెపిలోకి ఫిరాయించిన నలుగురిలో ఇద్దరు చాలా జోరుమీదున్నారు. ఆ ఇద్దరే అనేక ఆర్ధిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌధరి, సిఎం రమేష్.

నిజానికి నలుగురు ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించిందే చంద్రబాబునాయుడు ఆదేశాలతో అనే ప్రచారం తెలిసిందే. ఎప్పుడైతే బిజెపిలోకి ఫిరాయించారో వెంటనే సుజనా, రమేష్ చాలా యాక్టివ్ అయిపోయారు. లాబీయింగ్ చేయటంలోనే వీళ్ళిద్దరూ బిజిగా ఉంటారు ఎప్పుడూ. ఇందులో భాగంగానే బిజెపిలోకి జంప్ చేసిన దగ్గర నుండి కేంద్రమంత్రులతోనే కనబడుతున్నారు.

పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ రంగంలో పిపిఏల సమీక్ష, రాజధాని నిర్మాణం లాంటి అనేక అంశాలపై జగన్మోహన్ రెడ్డి తీరుపై ఇటు టిడిపి అటు బిజెపి నేతలు మండిపడతున్న విషయం అందరూ చూస్తున్నదే. పనిలో పనిగా జగన్ పై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా ఘాటుగానే మాట్లాడుతున్నారు. సుజనా, రమేష్ లు షెకావత్ తోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. కేంద్రమంత్రి మీడియా సమావేశంలో కూడా సుజనానే ఎక్కువగా కనబడుతున్నారు.

నిజానికి రాష్ట్రంలో బిజెపి నేతలు చాలామందే  ఉన్నా వారెవరూ కేంద్రమంత్రుల చుట్టూ తిరగటం లేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఢిల్లీలోనే ప్రదక్షిణలు చేస్తున్నారు. అంటే పొద్దున లేచిన దగ్గర నుండి వాళ్ళిద్దరి పనే అంత. కేంద్రమంత్రులే  వీళ్ళని ఎంటర్ టైన్ చేస్తున్నారో లేకపోతే వాళ్ళే వెళ్ళి వాళ్ళని అతుక్కుపోతున్నారో తెలీటం లేదు. ఎప్పుడు చూసినా కేంద్రమంత్రుల దగ్గరే కనబడుతుండటంతో వీళ్ళపై బిజెపి నేతల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి అమిత్ షా క్ కూడా కొందరు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మరి జాతీయ నాయకత్వం ఏమి చేస్తుందో చూడాలి.