ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌యా డిమాండ్ ఇదే..!

కరోనా వైరస్ కారణంగా పలు రంగాల వారిని ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు, టాక్సీ రంగానికి చెందిన వారిని కూడా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌ పార్టీ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దు చేసి ట్యాక్సీల యజమానులను ఆదుకోవాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సూచించారు. లాక్‌డౌన్ కార‌ణంగా, అన్ని రంగాల మాదిరే ట్యాక్సీలు నడుపుకొంటూ జీవించేవారు తీవ్ర కష్టాల్లోపడ్డార‌న్నారు.

దీంతో లాక్‌డౌన్ కొన‌సాగినంత కాలం, జన జీవనం స్తంబించడంతో అద్దెకు వాహనాలు తిప్పే పరిస్థితి ఎలాగూ లేద‌ని.. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు సడలించిన తరవాత కూడా ఉపాధి లభించే అవకాశాలు నామమాత్రం అయ్యాయ‌ని.. ఇన్ని ఇబ్బందుల్లో ఉండగా ట్యాక్సీలకు రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని రవాణా శాఖ ఒత్తిడి చేయడం క‌రెక్ట్ కాద‌ని, దీంతో వీరి బాధలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరారు.

ఇక ఆర్థికంగా నష్టపోయి ఆ వాహనాలు రుణాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉండగా ఈ నెలాఖరులోగా పన్నులు, రుసుములు అంటూ రాష్ట్ర రవాణా శాఖ చెప్పడంతో ట్యాక్సీల యజమానులు ఆందోళనకు లోనవుతున్నార‌ని ప‌వ‌న్ తెలిపారు. గత మూడు నెలలుగా తమ వాహనాలు తిరగకపోవడంతో, వారి జీవనమే కష్టంగా మారిందనీ, ఇక పన్నులు ఎలా చెల్లిస్తార‌ని, దీంతో వారి బాధలను ప్రభుత్వాలు సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాల‌ని.. ప్రజా రవాణా రంగంలో భాగమైన మాక్సీ టాక్సీ క్యాబ్స్ యజమానులు, వాటిపై ఆధారపడ్డ డ్రైవర్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు.