ప్రతిపక్ష పార్టీల నేతలకు అర్థమవుతోందా..?

ప్రతిపక్ష పార్టీల నేతలకు అర్థమవుతోందా..?

ప్రతి పక్షం అంటే చాలు కేవలం విమర్శించాడికే ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి పాలక పక్షం తప్పులను ఎత్తిచూపటం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటం అనేది ప్రతిపక్ష పార్టీల బాధ్యత.. కానీ ఇప్పుడు ఆ అర్థం మారిపోతోంది. ప్రతిపక్షంలోకి ఉంటే చాలు.. విమర్శించాలన్న ఆత్రం తప్ప మరోటి కనిపించేలా లేదు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్ మెంట్‌లో అందరికన్నా ముందుండేవారు అన్నది తెలిసిందే. విపత్తుల సమయంలో అయితే ఇక అన్నీ తానై, అవసరం అయితే ఏదైనా ప్రమాదం, లేదా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం పనులను పరిశీలించడం వంటివి అన్నీ ఎప్పటికప్పుడు మీడియా ముందు పెట్టేవారు. 

అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అందుకు పూర్తిగా విరుద్దంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఆచితూచి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏ అప్ డేట్ అయినా సరే ఆ పార్టీ ఇతర నేతలే ఇస్తున్నారు. పరిస్థితులపై స్పందిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీల నేతలు అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నారు. సీఎం క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించాలని అంటున్నారు.

కానీ ఇక్కడ వాళ్లు ఒక విషయం మర్చిపోతున్నారు.. ఇది తుఫానో.. లేదా మరో బోటు మునిగిపోయిన ప్రమాదమో కాదు.. ఓ ముఖ్యమంత్రి పర్యటనలు చేయడానికి, పరామర్శించడానికి. ఇప్పుడు పర్యటనల కన్నా వైద్య ఆరోగ్య శాఖలు, మున్సిపాల్టీ, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, ఇలా అందరినీ సమన్వయం చేసి వారికి దిశా నిర్దేశం చేయాలి. దాన్ని వదిలేసి ముఖ్యమంత్రి పరిశీలనలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోలేక పోవడం దురదృష్టకరం. పైగా ప్రజాప్రతినిధులే ఇలాంటి అవగాహన లేని వ్యాఖ్యలు చేయడం భాదాకరం కూడా.