ప్చ్.. 20 లక్షల కోట్లు  సామాన్యుడికి చేరేదెలా ?    

 

మూడో దశ లాక్‌ డౌన్‌ గడువు వచ్చే ఆదివారంతో ముగియబోతుంది.  మరి, కరోనా పై  ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు విజయం సాధించామా ?  లాక్‌ డౌన్‌ పరంపర యాభై రోజుల పూర్తి చేసుకున్నాక కూడా  కరోనా భయం భారత్ ని పట్టిపీడిస్తూనే ఉంది.  రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండటం కాదనలేని వాస్తవం కాదా..? కరోనా  పై  అలుపెరగకుండా పోరాడుతున్న రాష్ట్రాలు ఇప్పటికే  ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి.  ఇది ఇలాగే కొనసాగితే  రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి ? 
 
 
అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోవడమే ఉత్తమం. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరిట రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించడం మోదీ తీసుకున్న  నిర్ణయం..   అసాధారణమైన  నిర్ణయమే. కానీ,  ఈ విపత్కర పరిస్థితులనుంచి క్షేమంగా బయటపడాలంటే..  సామాన్యుడు కూడా ఈ ఆర్థిక విపత్తును సమర్ధవంతగా  ఎదురుకోవాలంటే.. ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అమలు అట్టడుగున స్థాయి ప్రజలకు కూడా చేరాలి. మరి ఈ స్వార్ధపూరిత రాజకీయ వ్యవస్థలో ఆ భారీ ప్యాకేజీని ఎలా ఖచ్చితత్వంతో పంచిపెట్టడం ?
 
 
మన దేశంలో వున్న అరకొర చట్టాలు, ఇప్పటికే ప్రవేశపెట్టిన  పథకాలు అంతంతమాత్రంగా అమలవుతున్న తీరును చూస్తుంటే..  ఈ ప్యాకేజీ  వల్ల అన్ని వర్గాలకు మేలు జరగుతుందని ఎలా నమ్మగలం ?  అందుకే ఫ్యాకేజీని  ఏ రకంగా వ్యయం చేస్తారు..?  ఏ రంగానికి ఎంతెంత మొత్తం కేటాయిస్తారు..?  ఏ వర్గానికెంత ఇస్తారు ? అనాదిగా అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు దక్కేది ఎంత ? సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఎలా ఆదుకుంటారు ?లాంటి సామాన్యుడి అనుమానులు తీరేలా కేంద్రప్రభుత్వం ఫ్యాకేజీ అమలు గురించి ముందే సమగ్రంగా  ప్రకటించి.. ఎలాంటి తప్పులు జరగకుండా కట్టుదిట్టం చెయ్యాలి.