ప్చ్.. కష్టం మాది పేరు ‘మోదీ’ది !

 
క‌రోనా దెబ్బకు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్న  ప్ర‌జ‌లను,  కేంద్ర ప్ర‌భుత్వం  భారీ ప్యాకేజీలు అంటూ అనవసరపు ఆశ కల్పించి కాలాన్ని నెట్టుకు రావాలనుకుంటుందా ? లేకపోతే ఇరవై లక్షల కోట్లు పంచడానికి ఇంత గందరగోళం అవసరమా ?  మొదట మోదీగారు 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ అని యాంకర్ లా ఏవేవో అంకెలు  చ‌దివేసి వెళ్లిపోయారు.  ఆ తరువాత  ‘ఆర్థిక’మ్మ నిర్మ‌లమ్మగారు వచ్చి  మీడియాలో సుదీర్ఘంగా ఏవేవో చ‌దువుకుంటూ పోయారు. సామాన్యుడికి ఇవన్నీ అర్ధం కానివి ? మరి రాజకీయ క్రీడ అని మేధావిలు కూడా సరిపెట్టుకోవాలా ? 

 

 
అసలు నిర్మ‌ల‌మ్మ  తొలి రోజు రు. 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వివ‌రాల గురించి చెప్పారు. అందులో ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌కు క‌లిగే ల‌బ్ధి ఏమైనా ఉందా అంటే.. లేదు. ఈ విషయంలో ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మోదీ టీమ్ పై తీవ్రంగా కామెంట్స్ చేశారు.  కేసీఆర్ కూడా బీజేపీ తీరును  డైరెక్ట్ గా తిట్టలేక వంకర టింకరగా నాలుగు మాటలు అనేశారు.  ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ పరిస్థితి అయితే మరీ అద్వానం. నిధులు లేవు, జీతాలు కూడా వేయలేని దుస్థితి..ఎప్పటినుండో ఆదుకోండి మహాప్రభూ అంటూ  కేంద్రం ముందు ఆకలి  అరుపులు అరిచినా  ఇన్నాళ్లూ  మోదీ గాంభీర్య చూపులతోనే  సరిపెట్టేశారు.    
 
 
ఆ కారణంగా జగన్ కూడా  మోదీ పై  తీవ్ర అస‌హ‌నంతోనే ఉన్నాడు. అలాగే  కేజ్రీవాల్ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా  మోదీ పై తీవ్ర గుస్సాతో ఉన్నారు. ఇక క‌రోనా నేప‌థ్యంలో ఎక్క‌డిక‌క్క‌డ నిబంధ‌న‌లు క‌ఠిన‌ త‌రం చేస్తూ   రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇన్నాళ్లు కష్టపడ్డాయి.  కానీ కరోనాని కట్టడి చేయడంలో విజయం సాధించిన ఏకైక వీరుడు ధీరుడు మోదీ అని ఇంటర్నేషనల్ రేంజ్ లో మోదీకి ప్రశంసలు దక్కుతున్నాయి. కష్టం మాది పేరు మోదీది అని  రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రులు తెగ  ఫీల్ అవుతున్నారట. ఇంతకీ  కేంద్రం ప్యాకేజీ గుట్టు ర‌ట్టు ప్రజలకు అర్ధం అయ్యేది ఎప్పుడో…!