అమరావతి నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ నిపుణుల కమిటిని నియమించింది. నిపుణుల కమిటి అంటే మరికొంత కాలం పాటు ఎటువంటి నిర్మాణాలు జరగవని అర్ధమైపోతోంది. అమరావతితో పాటు పనిలో పనిగా రాష్ర్ట సమగ్రాభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వటం కమిటి బాధ్యత. కమిటి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆరువారాల్లోగా తన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పింది.
ఈ కమిటికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్ డాక్టర్ మహవీర్, అర్బన్, రీజనల్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కెటి రవీంద్రన్, అహ్మదాబాద్ సెప్ట్ ప్రొఫెసర్ శివానంద స్వామి, చెన్నై రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ కెవి అరుణాచలం కమిటిలో సభ్యులుగా ఉంటారు. కమిటి అవసరమనుకుంటే పర్యావరణం, వరదల నియంత్రణపై ఓ నిపుణుడిని కూడా నియమించుకునే అధికారం ఇచ్చారు.
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్ కో చెబుతున్న ప్రాంతంలో భవిష్యత్తులో ఎటువంటి భారీ నిర్మాణాలను చేపట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎందుకంటే ఇదంతా ముంపు ప్రాంతం. గట్టిగా నాలుగు రోజులు భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాంతం మొత్తం ముణిగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కొండవీటి వాగు ప్రమాదం ఎలాగూ ఉండనే ఉంది.
ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టే శివరామకృష్ణన్ కమిటి అయినా ఇతర నిపుణులైనా ఇక్కడ రాజధాని నిర్మాణం వద్దన్నారు. అయినా వినకుండా చంద్రబాబు ఇక్కడే నిర్మాణాలు ప్రారంభించారు. ఇందుకే ఇపుడు జగన్ నిపుణుల కమిటిని వేశారు. నిపుణుల కమిటి నివేదిక ఇచ్చేంత వరకూ జగన్ అమరావతిపై ఎటువంటి నిర్ణయం తీసుకునేట్లు లేరు చూడబోతే. ఆ తర్వాతైనా నిపుణుల కమిటి నిర్ణయంపైనే ఆధారపడుంటుంది అమరావతి భవిష్యత్తు.