తొందరలో కొత్త జిల్లాలు ?

రాష్ట్రంలో తొందరలో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. నిజానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఈ విషయాన్ని బహిరంగ సభల్లోనే చాలా సార్లు చెప్పారు. ఇదే విషయాన్ని తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో జరిగిన భేటిలో చెప్పారని సమాచారం.

పరిపాలనా సౌలభ్యం కోసం పెద్ద జిల్లాలను చిన్నవిగా మారిస్తే బాగుంటుందన్న ఆలోచన ఎప్పటి నుండో వినబడుతోంది. జగన్ బహిరంగంగా చెప్పిన విషయం చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో కూడా వినబడింది. అయితే కారణం తెలీదు కానీ చంద్రబాబు హయాంలో ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. మూడు నెలల క్రితం జగన్ సిఎం అవ్వగానే తన ఆలోచనలకు క్రియా రూపం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జనవరి 26కి కొత్త జిల్లాలు ఏర్పడతాయట.

జగన్ ఆలోచనల ప్రకారం ప్రస్తుత 13 జిల్లాల రాష్ట్రం తొందరలో 25 జిల్లాల రాష్ట్రం అవ్వబోతోంది. జనాలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా చేర్చాలంటే చిన్న జిల్లాలైతేనే సాధ్యమని జగన్ అనుకుంటున్నారు. సరే అధికారుల్లో కూడా కొంత సానుకూలత కనబడుతోంది. ఎందుకంటే ఉద్యోగులకు తొందరగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి.

తెలంగాణాలో జిల్లాలు ఏర్పడినపుడు కొందరికి తొందరగా ప్రమోషన్లు వచ్చాయి. కాకపోతే కెసియార్ చెప్పింది పాలనా సౌలభ్యమనే అయినా తెరవెనుక ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయటమనే హిడెన్ అజెండా ఉందనే ఆరోపణలున్నాయి. అందుకనే ఏకరీతిగా జిల్లాల స్వరూపం లేదు తెలంగాణాలో.  మూడు నియోజకవర్గాలకు కూడా ఓ జిల్లా ఏర్పడింది. కానీ ఏపిలో అలా కాకుండా ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లా అంటున్నారు. కాబట్టి రాజకీయంగా జరిగే లాభ నష్టాలు అందరికీ సమానంగానే ఉండచ్చు.