తెలంగాణలో రాజకీయ నేతలు ఇటీవల తరచుగా వాడుతున్న మాట రాజకీయ సన్యాసం.. ఈ మాటలను అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం అన్న తేడాలేకుండా తెగ వాడుతున్నారు. ఏదో ఒక డిమాండ్ లేవనెత్తడం దానిమీద చర్చకు ఆహ్వానించడం రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేయడం పరిపాటిగా మారింది. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటి వరకు అనేక మంది నేతలు రాజకీయ సన్యాసం పదాన్ని బాగా వాడుతున్నారు. అయితే ఇందులో ఎంతమంది నిజంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారు? ఎంతమంది తూచ్.. ఉత్తదే అని ఎస్కేప్ అవుతారో తెలియదు కానీ రాజకీయ సన్యాసాల ట్రెండ్ మాత్రం తెలంగాణలో జోరుగా సాగుతోంది. మరి ఏ లీడర్లు ఎందుకు రాజకీయ సన్యాసాలు పుచ్చుకుంటామన్నారో ఒకసారి పరిశీలిద్దాం రండి.
‘‘తెలంగాణలో 2019 ఎన్నికల్లో తిరిగి టిఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’’ అని తెలంగాణ సిఎం కొడుకు మంత్రి కేటిఆర్ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ సవాల్ చేశారు. ఒక్కసారి కాదు పలుమార్లు కేటిఆర్ ఈ సవాల్ విసిరారు. అయితే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సవాల్ ను స్వీకరించి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని కేటిఆర్ ఉత్తమ్ కు సవాల్ చేశారు. దానికి ఉత్తమ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతి సవాల్ చేశారు. అంతేకాదు కేటిఆర్ మాట మీద నిలబడాలని కూడా మీడియా సాక్షిగా ఉత్తమ్ డిమాండ్ చేశారు. తన తండ్రి కేసిఆర్ మాదిరిగా మాట తప్పి పారిపోరాదని కూడా హెచ్చరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని, అలా చేయకపోతే తల నరుక్కుంటానని కేసిఆర్ ప్రకటించి మాట తప్పారని ఉత్తమ్ గుర్తు చేశారు.
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటీవల రాజకీయ సన్యాసం సవాల్ చేశారు. కేటిఆర్ తన చెల్లి కవితను గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుని శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. నిజామాబాద్ ఎంపిగా కవిత గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, గెలిపించుకునే దమ్ము ఉందా కేటిఆర్ అంటూ కోమటిరెడ్డి సవాల్ చేశారు. అయితే కోమటిరెడ్డి సవాల్ ను కవిత కానీ, కేటిఆర్ కానీ స్వీకరించినట్లు లేదు.
తాజాగా ఆర్టీసి ఛైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీలో దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని, తాను ఈ రాజకీయాల్లో ఇమడలేనని, అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు ఆర్టీసి ఛైర్మన్ పదవి ఇచ్చినా.. అధికారాలు మాత్రం ఇవ్వలేదని ఆయన కేసిఆర్ పై మండిపడ్డారు. తన నియోజకవర్గంలో అవినీతిపరుడైన రామగుండం మేయర్ లక్ష్మీనారాయణకు పార్టీ పెద్దలు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని ప్రకటించారు. కానీ తర్వాత కేటిఆర్ ఆయనతో భేటీ అయినంక కొద్దిగా మెత్తబడ్డారు. రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేసిఆర్ పరిపాలన, టిఆర్ఎస్ పార్టీ సూపర్ అంటూ కొత్త స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
ఇక వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా రాజకీయ సన్యాసం సవాల్ విసిరారు. తాను కమిషన్ కోసం రోడ్డు పనులు అడ్డుకుంటున్నానని వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ మనుషులు చేసిన ఆరోపణలపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తాను కమిషన్ల కోసం రోడ్డు పనులు ఆపినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. వరంగల్ నగరంలో మేయర్ నన్నపనేని నరేందర్ వర్సెస్ కొండా దంపతులు అన్నట్లుగా వాతావరణం నెలకొంది. మేయర్ నన్నపనేని కేటిఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడం, మరోవైపు కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సురేఖ రాజకీయ సన్యాసం సవాల్ ను లేవనెత్తారు.
ఇక తెలంగాణ టిడిపి సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు సైతం తాజాగా రాజకీయ సన్యాసం సవాల్ ను లేవనెత్తారు. ఆయన తెలంగాణలో కాకుండా తిరుపతికి వెళ్లి మరీ ఈ సవాల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తాను టిడిపిలో ఉన్న కాలంలో ఏనాడైనా చంద్రబాబుకు ఏమైనా అన్యాయం చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబితే తక్షణమే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
ఇక తెలంగాణ అటవీ పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సైతం రాజకీయ సన్యాసం సవాల్ విసిరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మీద జోగు రామన్న ఈ సవాల్ విసరడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని, రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని జోగు రామన్న సవాల్ విసిరారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బిజెపి లక్ష్మణ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాభవం తప్పదని శాపనార్థాలు పెట్టారు.
మొత్తానికి తెలంగాణలో రాజకీయ నేతలు రాజకీయ సన్యాసం సవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చేశారని చెప్పవచ్చు.