తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా కొనసాగుతూనే వున్నాయి. అయితే ఈ సమయంలో తిరుమలకు సంబంధించిన వదంతులు భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏదైనా విపత్తులు సంభవిస్తాయేమో అన్న ఆందోళన కలిగిస్తున్నాయి.

అదేంటి అంటే.. తిరుమ‌ల‌లో అఖండ దీపం కొండెక్కింద‌నే ప్ర‌చారం సోషల్ మీడియాలో వీప‌రితంగా జ‌రుగుతోంది. అయితే ఈ వ‌దంతుల‌పై స్పందించిన టీటీడీ వాటిని కొట్టి పారేసింది. అలాంటిదేమీ జరగదేలని వివరణ ఇచ్చింది. స్వామి వారి వద్ద సుప్ర‌భాతం నుంచి ఏకాంత‌సేవ వ‌ర‌కు అఖండ‌దీపం వెలుగుతూనే ఉంటుంద‌ని అది ఆరిపోవడం అంటూ ఏమీ లేదని రమణ దీక్షితులు తెలిపారు. భ‌క్తులు ఎలాంటి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు. అలాగే స్వామి వారికి నిత్యం జరిగే పూజలల్లో ఎలాంటి మార్పులు లేవని అన్ని కైంకర్యాలు యదావిధిగా సాగుతున్నాయని కూడా స్పష్టం చేశారు. కాబట్టి భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎలాంటి వదంతులను కూడా నమ్మొద్దు.

ఇక తిరుమల ఆలయ మూసివేతను చూస్తే.. చరిత్రలో ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే నిలిపివేసినట్లు చరిత్ర చెబుతోంది. 1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు… ఏకంగా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు రికార్డుల్లో నమోదయ్యిందని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కరోనా ప్రభావంతో ఆలయ దర్శనాన్ని నిలిపివేశారు.