డ్యామేజిని  కంట్రోల్ చేసిన జగన్

నాయకుడన్నవాడికి పార్టీకి జరిగే డ్యామేజిని కంట్రోల్ చేయటం తెలిసుండాలి. లేకపోతే చంద్రబాబునాయుడుకు జరిగినట్లే జరుగుతుందనటంలో సందేహం లేదు. కానీ నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్ సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవటంతో ఇటు పార్టీ అటు ప్రభుత్వం జనాల్లో పలుచన కాకుండా చర్యలు తీసుకోవటంలో సక్సెస్ అయినట్లే.

తన హయాంలో పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ జరిగిన డ్యామేజిని కంట్రోల్ చేయలేకపోయారు. పైగా ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీ, ప్రభుత్వానికి డ్యామేజి చేస్తున్న వాళ్ళనే వెనకేసుకొచ్చారు. దాంతో పార్టీ, ప్రభుత్వం ఒకేసారి జనాల్లో పలుచనైపోయింది.

ఆ విషయాన్ని గుర్తుంచిన జగన్ వైసిపి ఎంఎల్ఏపై చర్యలు తీసుకోవటంలో వెనకాడలేదు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఓ జర్నలిస్టుతో జరిగిన గొడవలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఎంపిడివో వివాదంలో ఏకంగా ఎంఎల్ఏనే అరెస్టు చేశారు.

పై రెండు ఘటనల్లోను తప్పెవరిదో తెలీదు. కానీ ఆరోపణలు ముసురుకున్నది మాత్రం ఎంఎల్ఏపైనే. ఎందుకంటే కోటంరెడ్డి వ్యవహారశైలి కారణంగా తప్పంతా ఎంఎల్ఏ పైనే ఉందని అందరు నిర్ధారణకు వచ్చేశారు. దాంతో జనాల్లో పార్టీపై చెడు అభిప్రాయం వచ్చేసింది. క్షేత్రస్ధాయిలో జరిగిన డ్యామేజిని జగన్ గ్రహించారు. దాంతో తన ఎంఎల్ఏ పైనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నా జోక్యం చేసుకోలేదు. అరెస్టు చేస్తున్నా పట్టించుకోలేదు.

ఫలితంగా పోలీసులకు జగన్ స్వేచ్చ నిచ్చారనే టాక్ మొదలైంది. ఇక్కడే జనాలు చంద్రబాబు-జగన్ పరిపాలనను పోల్చి చూసుకోవటం మొదలుపెట్టారు. బహిరంగంగా అధికారులపై చింతమనేని లాంటి వాళ్ళు దాడులు చేసినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. అదే జగన్ మాత్రం సొంత ఎంఎల్ఏ అనికూడా చూడకుండా దర్యాప్తులో పోలీసులకు స్వేచ్చ నివ్వటం ద్వారా జరిగిన డ్యామేజిని వెంటనే కంట్రోల్ చేశారు.