డీఎస్ కాంగ్రెస్ లోకి వస్తామంటే ఒప్పుకునేదే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీఎస్ కాంగ్రెస్‌ను వీడి వెళ్లారని విమర్శించారు. డీఎస్ ను కాంగ్రెస్ లోకి తీసుకున్నా..సీఎం పిలిచి శీనన్నా అంటే చాలు డీఎస్ కేసీఆర్ భజన చేస్తారంటూ సెటైర్లు వేశారు. డీఎస్ ను పార్టీలోకి తీసుకోవాలో వద్దో ఒకసారి కాంగ్రెస్ కమిటీ నేతలు ఆలోచించాలన్నారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను, డీఎస్ ను ఆలోచనలో పడేశాయి.
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలతో డీఎస్ పరిస్థితి డైలమాలో పడింది. టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్ తన కొడుకుల రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలతో ఎంపీ కవిత ఆధ్వర్యంలో నిజామాబాద్ నేతలు డీఎస్ ను సస్పెన్షన్ చేయాలని తీర్మానించారు. దానిని టిఆర్ ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు పంపించారు. అయితే దాని పై సీఎం కేసీఆర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇది ఇలా ఉంటే డీఎస్ కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజానికి డీఎస్ కాంగ్రెస్ లో చేరుతారని అంతా భావించారు. సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడంలో తాత్సార్యం చేస్తుండటంతో డీఎస్ కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లో కూడా చేరడానికి ఆయన వెనుక ముందు ఆలోచిస్తున్నారు.
డిఎస్ కాంగ్రెస్ లోకి వస్తే మళ్లీ ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుదని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది కీలక నేతలు ఆలోచిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల నుంచి తెలుస్తుంది. డిఎస్ ఇప్పుడు పార్టీలోకి వచ్చినా ఆయనతో పెద్దగా లాభం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నింటికి బలం చేకూరుస్తూ వీహెచ్ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎస ఏమి తేల్చుకోలేక నిశ్శబ్దంగా ఉంటారా లేకా అన్నింటిని అధిగమించి కాంగ్రెస్ లో చేరుతార అనేది చర్చగా మారాయి.