రాజకీయ నాయకులు ఒక్కోసారి ప్రకృతి విరుద్దంగా మాట్లాడుతుంటారు. అసలు సాధ్యం కాని విషయాలను సుసాధ్యం చేయాలని పిలుపునిస్తుంటారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడిన మాటలు అలానే ఉన్నాయి. అసలు ఎంత దూరం ఆలోచించినా జరుగుతుందనే సూచనలు కనిపించని విషయం ఒకటి చెప్పారాయన. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి విషయంలో తీవ్ర రాద్ధాంతం జరుగుతోంది. పదవికి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు మౌనంగానే ఉన్నా వీహెచ్ మాత్రం ఊగిపోతున్నారు. రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే ఒప్పుకునేది లేదని బాహాటంగా చెబుతూ తనకే ఎక్కువ క్రేజ్ ఉందని, పదవి తనకివ్వండని పట్టుబడుతున్నారు. ఈ వయసులో పార్టీ పగ్గాలు ఆశిస్తున్నా ఆయన్ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి జనాన్ని అలా ఆశ్చర్యానికి గురిచేయడం నచ్చిందో ఏమో తెలీదు కానీ వీహెచ్ ఇంకో ఆశ్చర్యకరమైన మాట మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లోని దొండపాడులో వంగవీటి రంగారావు విగ్రహాన్నిఆవిష్కరించే కార్యక్రమానికి వీహెచ్ ను ఆహ్వానించారు అక్కడివారు. రంగాకు కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉండటం, వీహెచ్ పార్టీలో సీనియర్ కావడంతో గౌరవంగా ఉంటుందని ఆయన్ను పిలిచారు. కార్యక్రమానికి వచ్చిన వీహెచ్ ఏపీకి వచ్చాం కాబట్టి ఏపీ రాజకీయాల గురించి ఏదో ఒక సంచలన వ్యాఖాయ్ చేద్దామని అనుకున్నారో ఏమో కానీ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పేరెత్తారు. వంగవీటి రంగా భవిష్యత్తులో సీఎం అవుతాడని హత్యచేశారని, ఆంధ్రలో 27 శాతం జనాభా ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని అంటూ కాపు నేతల్లో వంగవీటి రంగా తర్వాత అంతటి వేవ్ కాపు నేతల్లో పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉందని, పవన్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని అన్నారు.
ఈ మాటలు అటు కాంగ్రెస్ వారికి, ఇటు జనసేన కార్యకర్తలకు పొలమారెలా చేశాయి. కాంగ్రెస్, పవన్ కళ్యాణ్.. ఈ రెండు పదాలు బద్ద విరోధులు. కాంగ్రెస్ పార్టీ పవన్ ను ఆహ్వానించవచ్చుగాక కానీ పవన్ వెళతారా అంటే వందకు రెండొందల శాతం వెళ్లరు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం విభాగం తరపున టూర్లు చేసిన పవన్ ఒక సభలో పంచెలూడదీయండి అంటూ ఆనాటి ముఖ్యమంతి వైఎస్ మీదే పంచ్ డైలాగులు పేల్చి సంచలనం రేపారు. ఆ తర్వాత 2014 ఎన్నికలప్పుడు టీడీపీ, బీజేపీ కూటమితో చేతులు కలిపి కాంగ్రెస్ హఠావో అంటూ పిలుపునిచ్చి ఏపీలో కాంగ్రెస్ ఆనవాళ్లు కూడ లేకుండా చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ఇప్పటికీ జాతీయ కాంగ్రెస్ అంటే పవన్ కు పడదు. వారి విధి విధానాలకు పవన్ పూర్తిగా విరుద్ధం. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇవ్వడం ప్రకృతి విరుద్ధం కాకపోతే మరేమిటి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే ఎవర్ గ్రీన్ ఫార్ములా అందరికీ వర్కవుట్ అయినా పవన్, కాంగ్రెస్ విషయంలో మాత్రం అస్సలు పనిచేయదు.