వైకాపా నేతలు మోసపోయింది అమాయకత్వం వల్లనా ?

మోసగాళ్ళ మాయకు ఇన్నాళ్ళు సామాన్య ప్రజలు మోసపోవడం చూశాం.  కానీ రాజకీయ నేతలు మోసపోతే.  అది కూడా సాదాసీదా నేతలు కాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు.  కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.  ప్రజలకు ఇలాంటి మోసాల మీద అవగాహన కల్పించి మాయగాళ్ల వలలో పడకుండా కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా మోసపోవడం, పోలీసులను ఆశ్రయించడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.  అధికార వైకాపా నేత, అమలాపురం ఎంపీ చింతా అనురాధా తాజాగా తనను ఒకరు 2.5 లక్షల మేర మోసపోయినట్టు తన పీఏ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. 
 
తీరాచూస్తే ఆమెను మోసం చేసింది కొత్త వ్యక్తేమీ కాదు రాజకీయ వర్గాల్లో బాగా పేరు మోసిన మోసగాడు తోట బాలాజీ నాయుడు.  ఇతగాడు ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిదులనే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతూ వచ్చాడు.  ఇతని బారినపడిన వారిలో వీహెచ్ లాంటి బడా నేతలు ఉన్నారు.  ఇతన్ని పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు కూడ.  ఇతని పేరు రాజకీయ వర్గాల్లో బాగా పాపులర్.  ఇతని చేతిలోనే సదరు వైకాపా ఎంపీ మోసపోయారు.  
 
బాలాజీ నాయుడు పాత పద్దతిలోనే ఎంపీ మీద కూడా ప్రభుత్వ పథకాలనే ఎరగా వేశాడు.  తాను ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో డిప్యూటీ డైరెక్టర్ పదవిలో ఉన్నానని ఎంపీగారిని పరిచయం చేసుకున్న బాలాజీ ప్రభుత్వ ఖాతాలో కోట్ల కొలది నిధులు ఊరికే ఉన్నాయని, కొంత మొత్తం డిపాజిట్ రూపంలో చెల్లిస్తే కోట్లలో నిధులు విడుదల చేయిస్తానని, వాటిని నియోజకవర్గంలోని నిరుద్యోగుల కొరకు వాడవచ్చని నమ్మబలికాడు.  దీంతో నమ్మేసిన ఎంపీ విడతలవారీగా 2.5 లక్షలు బాలాజీ చెప్పిన ఖాతాలో వేశారు.  
 
డబ్బు అందిన తర్వాత బాలాజీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మోసపోయిన సంగతి గ్రహించిన ఎంపీగారు తన పీఏ ద్వారా పోలీసులకు పిర్యాధు చేశారు.  ఇలా మోసపోయింది ఆమె మాత్రమే కాదని ఇంకొందరు అధికార పార్టీ నేతలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే పెద్ద స్థాయిలో ఉన్న ఈ నేతలంతా డబ్బు కడితే కేంద్ర ఖజానా నుండి నిధులు విడులవుతాయానే అమాయకత్వంతో మోసపోయారా లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా ఫండ్స్ చేతిలో వేసుకుందామనే ఆశతో మోసపోయారా అనేది తెలీడం లేదు.  
 
ఏది ఏమైనా నేతలకు ప్రభుత్వ పథకాలు, నిధుల విడుదల విధానాలు, విడుదల ప్రాసెస్లో ఏయే శాఖలు, అధికారుల జోక్యం ఉంటుంది వంటి ముఖ్య విషయాలపై అవగాహన ఉంటే ఇలా మోసపోరు కదా, అసలు ఇలా దొడ్డిదారిన ప్రయోజనాలను చేకూరుస్తామనే వ్యక్తులకు భాద్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ఎలా సహకరిస్తారో అనుకుంటున్నారు జనం.  ఇక టీడీపీ నేతలైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలే మోసపోతే ఇక జనాన్ని ఏం కాపాడతారు ఇంతకీ వాళ్ళు మోసపోయింది ఆశతోనా.. అమాయకత్వం వల్లనా ?
అంటూ సెటైర్లు వేస్తున్నారు.