డాక్టర్ పై దౌర్జన్యం తప్పెవరిది ? 

 
జగన్ ప్రభుత్వం పై ఎలా బురద పోయాలా అని ఎదురుచూస్తున్న బాబుకి  డాక్టర్ సుధాకర్‌ సంఘటన పెద్ద అవకాశంగా దొరికింది.  వైద్యుల పై దేశం అంతా పూలు చల్లుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లాఠీలతో చితకబాదుతున్నారని చంద్రబాబు విమర్శలను  అందుకున్నారు.  డాక్టర్‌ సుధాకర్‌ ను పోలీసుల చేత కొట్టించి  మానసిక ఆస్పత్రిలో బలవంతగా చేర్పించారని బాబు తెగ బాధ పడిపోతున్నారు.  కరోనా మహమ్మారి భయంలో  ఆస్పత్రుల్లో వైద్యులకు మాస్కులు లేవన్నందుకు డాక్టర్ ను సస్పెండ్‌ చేస్తారా ?  పైగా నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టి పిచ్చాడని ముద్రవేసి మానసిక వైద్యశాలలో పడేస్తారా ? అంటూ బాబు, జగన్ పై కన్నెర్ర జేస్తున్నారు.   
 
బాబు మాటలు నిజం అయితే మాత్రం ఇది అమానుషమే..? కానీ డాక్టర్ పై అంత నీచంగా వ్యవహరించడానికి వైసీపీకి  ఉన్న ప్రత్యేక ఇంట్రస్ట్ ఏముందని ? జగన్ కు  డాక్టర్ కు మధ్య పాత పగలు కూడా లేవు కదా..  వైసీపీ కావాలని డాక్టర్ ను వేధించింది అంటే నమ్మలేం. కానీ ఒక దళిత డాక్టర్‌ను ఇంత ఘోరంగా అవమానించడాన్ని సమాజం తరుపున తీవ్రంగా ఖండించాల్సిందే.   సుధాకర్‌ పై పెట్టిన కేసులు తప్పుడు కేసులా లేక కరెక్టా అనే విషయం పక్కన పెట్టి  ఆ కేసులు ఎత్తివేయాలి.  సుధాకర్ వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ‘డాక్టర్‌ సుధాకర్‌ వెనుక టీడీపీ ఉందనే అనుకుందాం,  దాని వల్ల ఎవరు నష్టపోయారు ? ఇన్నాళ్లు డాక్టర్ హోదాలో  గౌరవంగా బతికిన  సుధాకరే కదా.. ఆయన ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇంక అనవసరమైన రాజకీయాలుకు వైసీపీ పోకుండా సుధాకర్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం పెద్దతనం అనిపించుకుంటుంది. 
 
అయితే పోలీసుల్లో కొంతమందికి క్రమశిక్షణ లేకుండా పోతుంది. కరోనా లాక్ డౌన్ పెట్టే  సమయంలో కూడా పోలీసుల తీరు చూశాం కదా.. జగన్, పోలీసులను కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల మీద లాఠీచార్జి చేయడానికి కూడా పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు అంటే వారిని ఏమనుకోవాలి ? ఒకపక్క వలస కార్మికుల దుస్థితి పై దేశం అంతా బాధపడుతుంటే ఏపీలో మాత్రం వారి పై కూడా కనికరం లేకుండా లాఠీచార్జి చేస్తున్నారు మన పోలీసులు.