స్థానికంలో చేతులెత్తేసిన టీడీపీ…?!

స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకడం కనాకష్టంగా మారినట్లు ఆ పార్టీ నేతల మాటలను బట్టి విధితమవుతోంది. పంచాయితీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు ఇలా తమ అభ్యర్థులుగా టీడీపీ భావించిన వారందరినీ వైసీపీ లాక్కుంటోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేప్పడాన్ని బట్టే ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని తెలుస్తోంది.  

వలసలు ప్రోత్సహించనని అంటూనే జగన్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారని టీడీపీ అంటోంది. డొక్కా మాణిక్య వరప్రసాద్, కదిరి బాబూరావు, సతీష్ రెడ్డి ఇలా తమ పార్టీ నుండి బలమైన నేతలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలోకి లాక్కుంటోందట వైసీపీ. డొక్కా కూతురికి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సీటు ఇస్తామని ఆశ చూపించారని, అందుకే డొక్కా టీడీపీ నుంచి వెళ్లిపోయారని కూడా ఆరోపిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, తమ పార్టీ ఓటమి పాలవుతుందనే భయంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందోని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను విరమించుకోవాలని ఆయన కోరుతున్నారు. అలాగే అధినేత చంద్రబాబు అందరికీ అండగా ఉంటారని, పార్టీ నేతలు ఎవరూ పార్టీని వీడి పోవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇదే నేతలకు వైసీపీ నుండి నేతలను లాక్కున్నప్పుడు ఆ బాధ తెలియలేదా అనే సెటైర్లు పడటం కొసమెరుపు.