పదే పదే పెయిడ్ ఆర్టిస్ట్స్ అరెస్టవుతున్నా తెలుగుదేశంపార్టీ నేతలకు బుద్ధి రావటం లేదు. తాజాగా తిరుమలలో చర్చి నిర్మాణమంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ముగ్గురు పెయిడ్ ఆర్టిస్ట్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలతో విషం చిమ్మటానికి టిడిపి పెద్దలు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసుకున్నారు.
మూడు నెలలకే జగన్ పై దుష్ప్రచారం చేస్తుంటే జనాలు పట్టించుకోవటం లేదన్న విషయం చంద్రబాబునాయుడు, లోకేష్ కు బాగా అర్ధమైపోయింది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాటం చేయమంటే టిడిపి నేతలు కూడా ముందుకు రావటం లేదు. అదే సమయంలో తమ ఆరోపణలు, విమర్శలను జనాలు కూడా పట్టించుకోవటం లేదు.
అందుకనే టిడిపి ముఖ్యులు రూటు మార్చారు. జగన్ ప్రభుత్వంపై తాము బురద చల్లకుండా ఇతరులతో చల్లించాలని ప్లాన్లు వేశారు. మొన్నటి వరదల సమయంలో రైతుల వేషంతో జగన్ తో పాటు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను ఓ రైతు నోటికొచ్చినట్లు తిట్టటం అందరూ చూసిందే. తీరా చూస్తే ఆయన అసలు రైతే కాదు. రైతు వేషంలో ఉన్న టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్. సరే తర్వాత ఆయన్ను అరెస్టు చేశారనుకోండి అది వేరే సంగతి.
తాజాగా తిరుమల చర్చి నిర్మాణం విషయంలో కూడా అదే జరిగింది. తామేదో గొప్ప భక్తులమన్నట్లుగా బిల్డప్ ఇస్తు తిరుమలలో జగన్ ప్రభుత్వం చర్చి నిర్మాణం చేస్తోందంటూ ఒకటే ఊదరగొట్టారు కొన్ని ఫొటోలతో. తీరా చూస్తే ఆ ఫొటోలన్నీ ఫేక్ వే అని తేలిపోయాయి. చివరకు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాము టిడిపి తరపున జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు అంగీకరించారని సమాచారం. మొత్తానికి పెయిడ్ ఆర్టిస్టులే టిడిపి కొంప ముంచేస్తున్నట్లున్నారు.