రాయలసీమ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిజాయితీ మీద అన్నీఅనుమానాలే. ఆయన చెప్పేరాయలసీమ కబుర్లను అమరావతి ఏరియాలో ఎవరైనా వింటారేమో గాని, రాయలసీమలో నమ్మరు. రాయలసీమలో గుంటల్లో వాన నీళ్లను చూపి ఇవన్నీ కృష్ణజాలాలే అంటే అక్కడోళ్లు చప్పట్లు కొట్టవచ్చు. రాయలసీమలో మాత్రం నవ్వుకుంటుంటారు. అందుకే ఆయన రాయలసీమ ఉక్కు నినాదం కొలిమిలాగా అంటుకోకుండా తుక్కు తుక్కయిపోయింది. కడప జిల్లాకు చెందిన టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ నాయుడితొ కడప ఉక్కుకోసం పది రోజుల నిరాహారదీక్ష చేయిస్తే, రాయలసీమ అట్టుడికిపోలే. పక్క జిల్లాలో కాదు, పక్కవూర్లో కూడా తాటాకులు కదల్లే. ఇదెక్కడి వింత. ఒక ప్రాంతానికి ప్రాణప్రదమయిన ఉక్కు పరిశ్రమ కోసం ఒక నాయకుడు, అందునా ఎంపి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రజలెవరూ పట్టించుకోలేదేమిటి. ఆయనకు మద్దతుగా బస్సులాపలేదు. రాళ్లుపడలేదు. స్కూళ్లు మూయలేదు, ఒక సమ్మెలేదు ఒక్క నినాదం లేదు. ఒక్కనరమానవుడు రోడ్డెక్కలేదు. టిడిపి నాయకులొచ్చి పరామర్శించడమే తప్ప ఆయన దీక్షా శిబిరం వద్ద మరొకసందడే లేదు. ఎందుకిలా జరిగింది?
కారణం, బిజెపితో,ప్రధాని మోదీ తో చెడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి గత నాలుగేంఢ్లలో ఎంతో అన్యాయం జరిగిందన్న విషయం గుర్తొచ్చింది. మోదీ ఇంత మోసం చేస్తాడా అని మనసు చివుక్కుమని చిందులేయడం మొదలుపెట్టాడు. మోదీ మిత్ర ద్రోహీ అన్నాడు. మిత్రద్రోహం మీద ఉద్యమం అన్నాడు. ఈ ప్రకటన చేసిన తర్వాత జరిగిన మొదటి ఉద్యమం సిఎం రమేష్ నిరాహార దీక్ష ఉద్యమం. ఇది అట్టర్ ప్లాప్ అయింది. ఎందుకంటే, ఇపుడు సోషల్ మీడియోలో తెగ హల్ చల్ చేస్తున్న ఎంపిల హేళన వ్యాఖ్యల వీడియో అసలు రహస్యం బయటపెట్టింది. పిల్లి కళ్లు మూసుకుని ఎవరూ చూడ్డంలేదులే అనుకుని పాలుతాగినట్లు, ఢిల్లీ జెసి దివాకర్ రెడ్డి ఇంట్లో కాపీ తాగుతూ విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు దీక్ష మీద ఎంపిలు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం నేత మనసులో వున్నవే అనిపిస్తుంది. పార్టీ కి కీలకమయిన వ్యక్తులయిన ఎంపిలు నిరాహారదీక్ష గురించి, కడప ఉక్కు గురించి, విశాఖ జో న్ గురించి మాట్లాడిన మాటలు క్షమార్హం కాదు. (వీడియో చూడండి)
అక్కడ కూర్చున్న నేతలంతా బాగా బలిసినోళ్లు కాబట్టి చంద్రబాబు ‘ఒక క్లాప్ పీకి’, ఇంకెప్పుడు ఇలా చేయకండని వదిలేశాడు. తెలిసినోళ్లు చెబుతున్నదాని ప్రకారం, ఈ వీడియో లీకేజీతో చంద్రబాబుకు చమటలుపుడుతున్నాయట. ఈ ఎంపిలు ఇలా మాట్లాడతారని దానిని వీడియో తీసి మీడియాలో లీక్ చేయాలనే అలోచన ముందే చేశారా. అందునా జెసి దివాకర్ రెడ్డి ఇంటిలో ఇది జరిగింది. జెసి ఇంటిలోకి అంత ఈజీగా వెళ్లడం సాధ్యమా? లేకపోతే, అప్పటికప్పడు వాళ్లుె హేళనగా మాట్లాడటం మొదలుపెట్టగానే వీడియో తీశారా? ఇలా పేలిపోయే వీడియోని మీడియాకు లీక్ చేయడం అషామాషీ వ్యవహారం కాదు. కచ్చితంగా ఈ ఎంపిల నిజాయితీని, తెలుగుదేశం ఉక్కుపోరాట స్ఫూర్తిని బయటపెట్టేందుకు కడపు మండిన వ్యక్తే ఇలా చేశాడా. అక్కడున్నవాళ్లంతా ఎంపిలు, వాళ్ల పిఎలే. మూడో వ్యక్తి ప్రవేశించలేని జాగా అది.
ఎంపిల ముచ్చట్లను బట్టి, తెలుగుదేశం పార్టీలో కేంద్రం దగ్గిర పెండింగులో ఉన్న ఏ ప్రాజక్టు మీద నిజాయితీ లేదని అర్థమవుతుంది. మురళీమోహన్ అనే రాజమండ్రి ఎంపి బరువు తగ్గేందుకు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నానని చెప్పారు. రేపు మరెక్కడయిన టిడిపి లు నిరాహార దీక్ష చేస్తే ఇలా వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఉంటుంది గాని, ఉద్యమం కోసం కాదు అని అనుకోవాలి.
సిఎం రమేష్ నాయుడు నిరాహారదీక్ష కూడా ఇలా వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామేనా. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చి విరమించే వరకు ఈ కడప ఉక్కు దీక్ష టిడిపి కార్యక్రమంలాగా సాగిందే తప్ప ఉద్యమంలా జరగనేలేదు.
ఒక టిడిపి నేత ఇలా వాపోయాడు. ‘బాస్ (చంద్రబాబు) బాగా సీరియస్ గా ఉన్నాడు. మనవాళ్లలోనే ఇలా కుట్రలుచేసే వాళ్లున్నారు. మన పరువు తీశారు. ఎవరో కనుక్కోండి,’ అన్నారు.