2014లో తెలంగాణ రావడం.. టిఆర్ఎస్ అధికార పీఠమెక్కడం ఏక కాలంలో జరిగిపోయాయి. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఇద్దరిని డిప్యూటీ సిఎం లు గా కేసిఆర్ నియమించారు. అందులో ఒకరు స్టేసన్ గన్ పూర్ నికయోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఆయనకు డిప్యూటీ సిఎం పదవి ఇచ్చినట్లే ఇచ్చి ఊడబీక్కున్నారు. రాజయ్యను కేసిఆర్ ఎందుకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
అనంతరం వరంగల్ ఎంపిగా ఉన్న కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేసిఆర్. కడియం కూడా ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అయితే రాజయ్యకు మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖతోపాటు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వగా కడియం కు మాత్రం విద్యాశాఖతోపాటు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎప్పుడైతే రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారో అప్పటినుంచి రాజయ్య ప్రతిష్ట టిఆర్ఎస్ పార్టీలో మసకబారుతూ వస్తోంది. రాను రాను రాజయ్య టిఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా నెట్టబడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనకున్న రాజకీయ చతురతను ఉపయోగించి వరంగల్ జిల్లాలో బలమైన నేతగా తయారవుతున్నారు. అంతేకాదు ఆయన తన కుమార్తె డాక్టర్ కడియం కావ్యను మెల్లమెల్లగా రాజకీయాల్లోకి పరిచయం చేసే పనిలో పడ్డారు.
రానున్న 2019 ఎన్నికల్లో కడియం శ్రీహరి తన సొంత నియోజకవర్గమైన స్టేషన్ గన్ పూర్ లో పోటీ చేయకపోవచ్చని వరంగల్ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు స్టేషన్ గన్ పూర్ నుంచి చట్టసభకు ప్రాతినిథ్యం వహించారు కడియం. అయితే అదే నియోజకవర్గంలో కడియం ను ఓడించిన రాజయ్య కూడా టిఆర్ఎస్ లో చేరడంతో 2014 ఎన్నికల్లో కడియం కు వరంగల్ ఎంపి సీటు, రాజయ్యకు స్టేషన్ గన్ పూర్ సీటు ఇచ్చారు. కానీ ఈసారి రాజయ్యకు స్టేషన్ గన్ పూర్ సీటు ఇస్తారా లేదా అన్నది అనుమానంగానే మారింది. ఎందుకంటే రాజయ్య సీటును ఈసారి కడియం కుమార్తె డాక్టర్ కావ్యకు ఇవ్వొచ్చన్న ప్రచారం జోరందుకున్నది. ఆ దిశగా కడియం శ్రీహరి కూడా సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కడియం కావ్య ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి కడియం బాటలో అడుగులు వేస్తున్నారు. స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.
డాక్టర్ కావ్య ఏం చేస్తున్నారంటే..?
డాక్టర్ కడియం కావ్య ఉస్మానియా మెడికల్ కళాశాలలో వైద్య విద్య చదివారు. ప్రస్తుతం ఆమె వరంగల్ లో డాక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో ఉస్మానియాలో కూడా సేవలందించారు. 2019 లో స్టేషన్ గన్ పూర్ నుంచి టిఆర్ఎస్ తరుపున పోటీ చేయడం కోసం ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి ఎంటర్ కాకుండా ప్రస్తుతం డాక్టర్ కావ్య స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సేవలు అందిస్తున్నారు. కడియం ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు. బాలికలు బహిస్టు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు. దీంతోపాటు అడపా దడపా తండ్రి కడియంతోపాటు రాజకీయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. కడియం ఫౌండేషన్ ద్వారా కడియం కావ్య చేస్తున్న సేవలు తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఫేస్ బుక్ లోని తన వాల్ మీద కావ్య పెట్టిన పోస్టు నెటిజన్లకు బాగా నచ్చింది. తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు డాక్టర్ కడియం కావ్య
ఇక డాక్టర్ రాజయ్య పరిస్థితి టిఆర్ఎస్ లో మరింత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. రాజయ్యను ఉపముఖ్యమత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొద్దిరోజుల్లోనే ఆయన హోదాకు సరిపోయే పదవి ఇస్తానని కేసిఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజయ్య చెప్పారు. కానీ ఏండ్లు గడుస్తున్నా రాజయ్యకు పదవి రాలేదు. కనీసం కేసిఆర్ కుటుంబసభ్యులు రాజయ్యను పట్టించుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో 2019 లో రాజయ్యకు సీటు వస్తుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాజయ్య సీటుకు కడియం కావ్య ఎసరు పెడుతున్నారని వరంగల్ లో టాక్ నడుస్తోంది.