జగన్ ప్రభుత్వం పై గొంతెత్తిన వైసీపీ ఎమ్మెల్యే !

 
ఇసుక ఎక్కడైనా ‘ఇసుక’నే కానీ,  ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇసుక  బంగారం.  రాష్ట్రంలో ఇసుక మాఫియా అక్రమాల గురించి,  వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ ఇసుక సరఫరాలో మాత్రం అక్రమాలు ఇంకా సాగుతూనే ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలే కాదు, స్వంత పార్టీ వాళ్ళు  కూడా ఆరోపిస్తున్నారంటే..  ఇసుక మాఫియా దురాగతాల స్థాయి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.  నిజానికి ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం  ఆన్ లైన్లో ఎవరికి వారే బుక్ చేసుకునే సులువైన పద్ధతిని తెచ్చింది. అయితే అదే టెక్నాలజీ వాడుకుని ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారనేది స్పష్టం.  ప్రజలు ఇసుక దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనేది అక్షర సత్యం.
 

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా  ఇసుక విషయంలో అన్యాయాలు జరుగుతున్న మాట  నిజమే అని చెప్పారు.  జెడ్పీ సమావేశంలో బ్రహ్మనాయుడు ఇసుక పై  మాట్లాడుతూ.. ‘ఇసుక యార్డు దాకా రాకుండా మధ్యలోనే మాయమైపోతుందనేది నిజమే. అయితే అది ఎక్కడకు పోతుందో మాక్కూడా తెలియదు. గ్రామంలో మా కార్యకర్తలే మాకు ఇసుక ఇప్పించమని అడిగితే బొచ్చెడు ఇసుక కూడా ఇప్పించలేని పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పలేని పరిస్థితి మాది.  కలెక్టరుకు, మైనింగ్ వారికి పలు మార్లు ఇసుక అక్రమాల పై ఫిర్యాదు చేసినా  ఫలితం లేకుండా పోయింది.  మేం చెప్పే దానికి  చేసే దానికి చాలా తేడా ఉన్న మాట వాస్తవం. ఎన్ని స్కీములిచ్చినా  ఇసుకను ప్రజలకు సులభంగా చేర్చలేకపోతున్నాం’ అని ఆయన అన్నారు.

 
 
అయినా  యార్డుకు రాకుండా ఇసుక మధ్యలో ఎక్కడకు పోతుంది ? ఇసుక బ్లాక్ మార్కెట్ గురించి వైసీపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం ఆ పార్టీ వాళ్లకు నచ్చకపోవచ్చు గాని, వాస్తవం మాట్లాడినందుకు ఆయనను అభినందించాలి.  రాష్ట్రంలో రీచ్ లెవెల్లో కొందరు ఇసుక దారి మళ్లిస్తూ అక్రమాలు చేస్తుంటే…  అమాయక ప్రజలు  అధిక ధరకు బ్లాక్ లో బుక్ చేసి ఇసుకను వాడుకుంటున్న పరిస్థితి ఉంది.  సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేనే ఇసుక అక్రమాల గురించి గొంతెత్తారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 గత ప్రభుత్వం కంటే ధరలు అధికంగా పెంచి ఇసుక పాలసీ తీసుకువచ్చినప్పటికీ సక్రమంగా సరఫరా జరగడం లేదని జగన్ ప్రభుత్వం గుర్తించాలి.  మేలిరకం ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే.. నాసిరకం ఇసుక మాత్రం రాష్ట్రంలో సరఫరా జరుగుతుంది.  దీని వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.  తక్షణమే ప్రభుత్వం ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తే అది జగన్ కే మంచింది.