జగన్ పై శ్రీకాకుళం సెంటిమెంటు ?

పాదయాత్ర ముగించిన సిక్కోలు జిల్లాపైనే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లే కనిపిస్తోంది.  ఇడుపులపాయలలో మొదలైన 3680 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా పాదయాత్రను ఇచ్చాపురంలోనే ముగించారు. అంటే తండ్రి, కొడుకులకు శ్రీకాకుళం జిల్లా సెంటిమెంటిగా మారినట్లు అనుకోవచ్చు.

అందుకే ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న రెండు పథకాలను జగన్ సిక్కోలు జిల్లాలోనే ప్రారంభిస్తున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ పథకాన్ని ఈనెల 6వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జగన్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్నీ మండలాల్లో పంపిణీ చేయటానికి బియ్యాన్ని ఇప్పటికే రంగం సిద్దం చేశారు.

అలాగే పలాసలోనే కడ్నీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కూడా జగన్ డిసైడ్ అయ్యారు. కేవలం కిడ్నీ బాధితుల కోసమే రాష్ట్రంలో ఏర్పాటవుతున్న మొట్టమొదటి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి ఇది. 200 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు రీసెర్చి సెంటర్, రోగుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు రూ. ప్రభుత్వం రూ. 50 కోట్ల కేటాయించింది.

నిజానికి అభివృద్దిలో ఉత్తరాంధ్ర వెనకడిందనటంలో సందేహం లేదు. ఇకడ సమస్య ఏమిటంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే విశాఖపట్నం సిటి అభివృద్ధే అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. అలాకాకుండా మూడు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ అనుకున్నారు. అందుకనే మొదట పలాసతో మొదలుపెట్టారు. మొత్తం మీద జగన్ వల్ల అయినా ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది ?