ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ అంతా సహకరించాలని కూడా కోరారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి, ప్రతిపక్ష నేత ఎందుకు సమర్థించారు అంటే..?
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆంధ్రా విద్యార్థులు, ప్రజలు తమ సొంత ఊళ్లకు క్యూ కట్టారు. తెలంగాణ పోలీసుల నుంచి ఎన్‌ఓసీలు తీసుకుని ఏపీ సరిహద్దులకు చేరారు. అయితే ఇక్కడే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని రాష్ట్రంలోకి రాకుండా ఆపేసింది.ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. కాదూ కూడదు అంటే.. ఏపీలోకి వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరించిన వారిని మాత్రమే అనుమతిస్తామని తెగేసి చెప్పారు.
దీంతో విద్యార్థులు, ప్రజలు ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనపై ఏపీ సీఎం కూడా స్పందించారు. వారిని ఆపడంపై బాధను వ్యక్తం చేస్తూనే.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికే మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన మద్దతు తెలిపారు. అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.ప్రయాణాలు సైతం మానుకోవాలని కోరారు. అయితే అదే పార్టీకి చెందిన నేతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతుంటే.. అధినేత ఇలా అండగా నిలబడటం కాస్త గందరగోళంగా ఉంది.