జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్న కోర్టు కేసులు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రహ బలమేమో గాని రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి కోర్టు కేసులు నిను వీడను నీడను నేనే అన్నట్లు వెన్నాడు తున్నాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పరిటాల రవి హత్య కేసులో ప్రమేయ ముందని ఆరోపణలు రాగానే సిబిఐ విచారణ ఎదుర్కొనాలసి వచ్చింది. అనంతరం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అక్రమాస్తుల కేసులు నమోదు కావడం తుదకు 16 నెలలు జైలు జీవితం గడప వలసి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ రోజు ముఖ్యమంత్రిగా వున్నా అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిన అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఎవరికైనా ఇబ్బందికరమే. పోనీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అయినా ప్రభుత్వాధినేతగా స్థిమితంగా వున్నారంటే అదీ లేదు. ప్రభుత్వ పరంగా కొన్ని కేసుల సందర్భంగా కోర్టుల్లో తీవ్ర మైన వ్యాఖ్యానాలు ఎదుర్కొనాలసి వస్తోంది. ఇది ఎవరిలోపమో లేక అనుసరిస్తున్న విధానాల ఫలితమో ఏమో గాని ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి హైకోర్టులో ప్రతి రోజు ఏదో ఒక కేసు ప్రభుత్వానికి చెంది విచారణ జరుగుతోంది. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న సందర్భం లేదు. వైసిపి ప్రభుత్వం ఏర్పడగానే తొలుత విద్యుత్ కొనుగోళ్లు తదుపరి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరు మార్పు అంశాలపై కోర్టు మెట్లెక్క వలసి వచ్చింది. రాజధాని తరలింపు మీద పలు కేసులు నడుస్తున్నాయి. అప్పటి నుండి వరస బెట్టి కేసులు ఎదుర్కొంటున్నారు.

ఈ నెల 6 వ తేదీ గురువారం ఒక్క రోజునే మూడు కేసులను హైకోర్టు విచారించింది. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో ఏమీ కేసులు లేవన్నట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న కేసుల విచారణకే హైకోర్టు పరిమితమౌతోందా అని పిస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించ కూడదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా వున్నా రాష్ట్ర ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన కేసు తిరిగి హైకోర్టుకు రాగా విచారణ జరిపిన హైకోర్టు గురువారం తీర్పు వాయిదా వేసింది

దీనికి తోడు విశాఖను పరిపాలన రాజధాని చేసే సందర్భంగా అచ్చట గల మిలీనియం టవర్ లో ఐటి కంపెనీలను ఖాళీ చేస్తున్నారనే కేసు దాఖలు అయింది. ఈ కేసును గురువారం హైకోర్టు విచారణ జరిపి వాయిదా వేసింది. కాగా కర్నూలుకు విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాల తరలింపు కేసు విచారణ జరిగింది.

ఇవన్నీ అటుంచి ప్రభుత్వ కార్యాలయాలకు గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యాలయాలకు వైసిపి రంగు వేయడంపై హైకోర్టు ఇదివరకే సీరియస్ కామెంట్ చేసినా గురువారం విచారణ సందర్భంగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కోరి కేసు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు తాము ఏమీ చేయ లేమని ఎన్నికల కమిషన్ హైకోర్టు కు విన్నవించగా తామే ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. బహుశా భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అధికారం చేపట్టిన అనతికాలంలోనే ఇన్ని కేసులు ఎదుర్కొన్న సందర్భం లేదేమో. ముఖ్యమంత్రి హోదాలో కోర్టు కేసుల విచారణకు హాజరైన వారిలో బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండవ వారుగా వున్నారు.