చంద్రబాబునాయుడు కలల రాజధాని చెదిరిపోయినట్లే అనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుండి సింగపూర్ కన్సార్షియం తప్పుకున్నట్లు ఎల్లోమీడియా కథనం ఇచ్చింది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను కన్సార్షియం పరిశీలిస్తున్నట్లే ఉంది. అధికారంలో నుండి చంద్రబాబు పక్కకు తప్పుకోవటంతో తమ పప్పులుడకవన్న విషయం సింగపూర్ కంపెనీలకు బాగా అర్ధమైనట్లే ఉంది.
పైగా చంద్రబాబు లాగ జగన్మోహన్ రెడ్డి కలల్లో విహరించే మనిషి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే సీడ్ క్యాపిటల్ నిర్మాణం నుండి పక్కకు తప్పుకోవటమే మేలని సింగపూర్ కంపెనీలు భావించినట్లున్నాయి. అందుకనే సీడ్ క్యాపిటల్ నిర్మాణం ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ లేఖ రాశారని ఎల్లోమీడియా తన కథనంలో చెప్పింది.
నిజానికి జగన్ కు కావాల్సింది కూడా ఇదే. అడ్డదిడ్డమైన పద్దతుల్లో చంద్రబాబు సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. నామమాత్రపు పెట్టుబడితో వేల కోట్ల రూపాయలు సింగపూర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాలు బయటపడితే కోర్టులకు వెళ్ళే వారుంటారన్న కారణంతో చంద్రబాబు అగ్రిమెంటును కూడా రహస్యంగానే ఉంచేశారు.
ఎప్పుడైతే ప్రభుత్వం మారింది రాజధాని నిర్మాణంపై ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. చంద్రబాబు కలల రాజధాని లాగ కాకుండా అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టును నిర్మిస్తే చాలని జగన్ అనుకుంటున్నారు. అందులోను హై కోర్టును కర్నూలుకు తరలిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి వాస్తవ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకునే జగన్ వ్యవహరిస్తున్నారు. అందుకనే సింగపూర్ కంపెనీలు తప్పుకున్నాయట.