చంద్ర‌బాబు పై.. వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జ‌రిగిన నేప‌ధ్యంలో వల్లభనేని వంశీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్ర‌మంలో మీడియాతో మాట్లాడిన వంశీ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా తన వద్ద ఉన్న చెంచాలను పక్కన పెట్ట‌క‌పోతే టీడీపీ దుకాణం పూర్తిగా స‌ర్ధుకోవాల్సివ‌స్తుంద‌న్నారు.

ఇక పోటీ ఇవ్వలేని నేప‌ధ్యంలో, టీడీపీ ఎందుకు పోటీ పెట్టిందని ఆయ‌న ప్రశ్నించారు. ముఖ్యంగా త‌న‌ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత, ఓటు అడగడం ఏంట‌ని వంశీ ప్ర‌శ్నించారు. ముందుగానే తెలిసినా ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్యను పోటీకి దించ‌డం క‌రెక్ట్ కాద‌ని, దీంతో చంద్ర‌బాబు దళితులను అవమానించార‌ని వంశీ మండిప‌డ్డారు. ఇక కరోనా సమయంలో అసెంబ్లీ, పదో తరగతి పరీక్షలు ఎందుకని చంద్రబాబు అన్నార‌ని.. అయితే ఇప్పుడు రాజ్య‌సభ ఎన్నికలు జ‌ర‌గ‌డానికి కారణం ఆయనేనని వంశీ ఆరోపించారు.

ప్ర‌స్తుతం చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని నమ్మడం లేదా లేక టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనను నమ్మడం లేదా అని వంశీ ప్ర‌శ్నించారు. ఎందుకంటే.. వైసీపీ త‌రుపున పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులను పోలింగ్ వద్ద ఏజెంట్లుగా పెడితే, టీడీపీ నుండి తన ఎమ్మెల్యేలను ఎవరిని ఎందుకు పెట్టలేదని వంశీ ప్రశ్నించారు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే కాని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను టీడీపీ నియమించుకుందని వంశీ ఎద్దేవా చేశారు. ఈ క్ర‌మంలో పార్టీ పరిస్థితి బాగోలేదని, చంద్రబాబు తాను చేస్తున్న తప్పులను తెలుసుకుని వేరేవారికి పార్టీని అప్పగించడం మంచిదని వంశీ హిత‌వుప‌లికారు.