చంద్రబాబు సంపద సృష్టించారా ?

వినటానికి జోక్ గా అనిపిస్తున్నా ఎల్లోమీడియా మాత్రం చంద్రబాబునాయుడు గురించి అలాగనే రాసింది. తన ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు సంపద సృష్టించారట. చంద్రబాబు సంపద సృష్టి కోసం కష్టపడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెట్టారని ఎల్లోమీడియా పెద్ద కథనాన్నే ఇచ్చింది.

జగన్ నూరు రోజుల పాలనను చంద్రబాబు పాలనతో పోలుస్తు ఓ అసత్య కథనాన్ని అల్లేసింది. చంద్రబాబు, జగన్ పాలనలో పోలిక చూడాలని అనుకోవటం తప్పుకాదు. అయితే అప్పుడు చేయాల్సిందేమిటంటే జగన్ నూరు రోజుల పానలతో చంద్రబాబు మొదటి నూరు రోజుల పాలనను పోల్చాలి. అంతేకానీ చంద్రబాబు ఐదేళ్ళ పాలనను జగన్ నూరు రోజుల పాలనతో ఎలా పోలుస్తారు ?

సరే ఆ విషయాన్ని పక్కనపెడితే ఎల్లోమీడియా చెప్పినట్లే చంద్రబాబు సంపద సృష్టించారనే అనుకుందాం.  మరి సృష్టించిన సంపద అంతా ఏమైపోయింది ? జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఖజానా ఒట్టిపోయిన ఆవులాగ ఎందుకుంది ? వేలాది కోట్ల రూపాయల బిల్లులను చెల్లించకుండా చంద్రబాబు ఎందుకు పెండింగ్ పెట్టినట్లు ? నిజంగానే చంద్రబాబు సంపద సృష్టిస్తే సుమారు రూ. 1.7 లక్షల కోట్ల అప్పులెందుకు చేసినట్లు ?

ఇటువంటి కథనాలు, వార్తలు ఇచ్చే చంద్రబాబును ఎల్లోమీడియా ఐదేళ్ళు మభ్యపెట్టింది.  ఎల్లోమీడియా మాయలో పడిపోయిన చంద్రబాబు ఆ రాతలే నిజమని నమ్మి మొన్నటి ఎన్నికల్లో బోర్లా పడ్డారు. తాము రాస్తున్నవి  అబద్ధాలని ఎల్లోమీడియాకు బాగా తెలుసు. అయినా తమ పద్దతి మార్చుకోవటం లేదంటే చంద్రబాబును నిండా ముంచేయాలని కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది.