చంద్రబాబు గురివింద గింజ సామెత

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి గురివింద గింజ సామెత బాగా సరిపోతుంది. గురివింద గింజ తన క్రింద నలుపు తానెరగదట అనేది సామెత. ఇదంతా ఎందుకంటే, నోటికొచ్చినట్లు హామీలిచ్చేసి అధికారంలోకి వచ్చేసిన తర్వాత తప్పించుకు తిరుగుదామంటే కుదరదని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబునాయుడు ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. నిజంగా చంద్రబాబు వేసిన పెద్ద జోక్ గానే పరిగణించాలి.

స్వేచ్చగా చదువుకోవాల్సిన విద్యార్ధులు తమ ఫీజుల కోసం ఉపకార వేతనాల కోసం ధర్నాలకు, బంద్ లకు దిగటం ప్రభుత్వ వైఫల్యాలకు, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమంటూ చాలా పెద్ద పదాలు వాడేశారు. చంద్రబాబు చెప్పిందే నిజమైతే తాను అధికారంలో ఉన్న ఐదేళ్ళు చంద్రబాబు చాలాసార్లే ఫెయిల్ అయినట్లు, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినట్లు ముందు అంగీకరించాలి.

నోటికొచ్చినట్లు హామీలిచ్చే విషయంలో చంద్రబాబును మించినోళ్ళు ఎవరూ లేరన్న విషయం ఇప్పటికే రుజువైపోయింది. 2014లో అధికారంలోకి రావటమనే ఏకైక ధ్యేయంతో చంద్రబాబు 600 హామీలిచ్చారు. అందులో తాను ఎన్నింటిని సంపూర్ణంగా నెరవేర్చారో చంద్రబాబే చెప్పాలి. హామీలివ్వటం తర్వాత తెప్ప తగలేయటం వల్ల జనాలు మొన్నటి ఎన్నికల్లో టిడిపి గూబ పగలగొట్టారు. అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు.

ఐదేళ్ళు అధికారంలో ఉన్నపుడు తానిచ్చిన హామీలను నెరవేర్చాలన్న జ్ఞానం లేని చంద్రబాబు మూడు నెలల క్రితమే గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే అంటూ డిమాండ్  చేయటం విచిత్రంగా ఉంది. ఖాళీ ఖజనాతో పాటు లక్షల కోట్ల అప్పులను కుప్పను జగన్ కు అప్పగించినందుకు సిగ్గుపడాల్సిన చంద్రబాబు ఇంకా ఎదరు దాడి చేస్తుండటమే విడ్డూరం.