చంద్రబాబుని మోసగాడన్న మోత్కుపల్లి

ఏపీ సీఎం చంద్రబాబు మోసగాడని, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రసని టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహ్ములు విమర్శించారు. చంద్రబాబులాంటి నీచుడిని నమ్మెద్దని ఎన్టీఆర్ ఆనాడే హెచ్చరించినా వినకుండా నమ్మి మోసపోయానని ఆక్రోశించారు. ఎన్టీఆర్‌ని మానసికంగా చంపి హత్య చేసిన నీచుడు చంద్రబాబని, కేసీఆర్‌ను రాజకీయంగా చంపాలని ప్రయత్నించాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సీఎం కుర్చీ కోసం పిల్లనిచ్చి వంచన చేర్చుకున్న మామకు వెన్నుపోటు పొడిచాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అధర్మాలపై ధర్మపోరాటం పేరుతో మోత్కుపల్లి అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఆయనకు తిరుపతిలో వైసీపీ, జనసేన, దళిత సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అలిపిరిలో ఆయన విలేఖరుల సమావేశంలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు కుల రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారని, చంద్రబాబు కుల రాజకీయాలతో టీడీపీలో దళితులంతా దగా పడ్డారన్నారు. పార్టీలో కష్టపడ్డ ఏ ఒక్క దళిత నాయకునికై న్యాయం చేశారా? కేంద్రమంత్రి పదవులు, రాజ్యసభ సభ్యులుగా దళితులు పనికిరారా ? అంటూ మోత్కుపల్లి చంద్రబాబుని నిలదీశారు. ఒక్కో రాజ్యసభ సీటును వంద కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లకు ఏ అర్హత ఉందని ఎంపీ పదవులిచ్చారని ప్రఃశ్నించారు. చంద్రబాబును ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ టీడీపీలో బలమైన నేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ బీజేపీతో జత కట్టాక గవర్నర పదవి ఆశించాడు. ఆ దిశగా తనకు అధినేత నుంచి క్లియరెన్స్ కూడా వచ్చిందని మోత్కుపల్లి నర్సింహ్ములు పలు సార్లు బహిరంగంగా చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో కానీ గవర్నర్ల నియామకం జరిగినప్పుడు మోత్కుపల్లి నర్సింహ్ములుకు గవర్నర్ పదవి దక్కలేదు. ఆ తర్వాత ఏపీ నుంచి మోత్కుపల్లిని రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వచ్చాయి. అవి రెండు కూడా నెరవేరకపోవడంతో మోత్కుపల్లి… చంద్రబాబుతో అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు. ఏ సమావేశాలకు హాజరుకాకుండా నిరసన తెలిపారు. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో బాబుపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించాడు. చంద్రబాబు నయవంచకుడని, మోసగాడని పలు సంధర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు మోత్కుపల్లి. పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలతో క్రమశిక్షణా చర్యల కింద మోత్కుపల్లిని టిడిపి నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఆయన ఇంకా దూకుడు పెంచి విమర్శలు గుప్పిస్తున్నారు. చివరికి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీయనున్నాయో మరీ…