గ్రేటర్ గ్రౌండ్ లెవల్ ఆకర్ష్‌లో కేటీఆర్ బిజీ

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్… ఆపరేషన్ ఆకర్ష్ పై సీరియస్ దృష్టి పెట్టిందా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని తానై ముందుండి జీహెచ్ ఎంసీ పీఠాన్ని టీఆర్‌ఎస్ గెలుచుకోవటంలో కీలక పాత్ర పోషించిన మంత్రి కేటీఆర్ సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టారు. గ్రేటర్‌లో ఉన్న ఏ ఒక్క నాయకున్ని కోల్పోకుండా అలాగే ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకునేందుకు కేటీఆర్ పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. అందుకు ఆయన ఈ మధ్య గ్రేటర్ హైదరాబాద్‌లో చేస్తున్న వరుస రాజకీయ పర్యటనలు, సమావేశాలే నిదర్శనం. ఇంతకీ ఆ గ్రేటర్ ఆకర్ష్ ఏంటి..

 

మంత్రి కేటీఆర్ గ్రేటర్ రాజకీయాలపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోనే పూర్తి పట్టు సాధించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలలో 99 కార్పొరేటర్లను ఒంటి చేత్తో గెలిపించాడు. అన్నీ తానై ప్రచారాలు నిర్వహించి, అహర్నిషలు శ్రమించి గ్రేటర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకునేలా  చేశారు. 2019 సాధారణ ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్ లో ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా ఇతర పార్టీలో చేరకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాగే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు కూడా తన అనుఃచరులతో చర్చలు జరుపుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న ఇతర పార్టీల బలమైన నాయకులను టీఆర్’ఎస్ లో చేర్పించే బాధ్యత ఎమ్మెల్సీ , గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జీగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుకు అప్పగించారు. మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో మరికొంత మంది నేతలు ఈ ఆపరేషన్ ఆఃకర్ష్ లో పాల్గొంటున్నారు. ఆయన ఇప్పటికే చాలా మంది నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది.

ఆ ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్పించటంలో సఫలమయ్యారు. అందుకే పార్టీలో ఉన్న నేతలు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారు చేజారకుండా వెంటనే బుజ్జగింపుల పర్వానికి దిగుతున్నారు. ఎంతలా అంటే తమ హోదాను కూడా మరిచి కింది స్థాయి నేతల వద్దకు కూడా వెళ్లి చర్చిస్తున్నారు గులాబీ నేతలు. అందుకు నిదర్శనమే ఘట్‌కేసర్ జడ్పీటీసీ అంశం. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ జడ్పీటీసీ మండ సంజీవరెడ్డి విబేధాలతో జడ్పీటీసీ పదవికి రాజీనామా సమర్పించారు. అధికారులు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పినట్టే నడుస్తున్నారని, అలాగే బోడుప్పల్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేయాలని ఎమ్మెల్యేకి, ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో తనకు విలువ ఇవ్వనప్పుడు ఈ పదవి ఎందుకనీ జిల్లా కలెక్టర్, మంత్రి మహేందర్ రెడ్డికి తన రాజీనామా లేఖను సంజీవరెడ్డి సమర్పించారు. దీన్ని సీరియస్ గా పరిగణించిన టీఆర్ఎస్ అధిష్టానం రాజీనామాను ఉపసంహరించుకోవాలని బుజ్జగించింది. సంజీవరెడ్డి నిర్ణయంలో మార్పు లేకపోవడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. వాస్తవ వాస్తవాలు తెలుసుకొని బోడుప్పల్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తానని హామినిచ్చి అతనిని బుజ్జగించి రాజీనామాను వెనుకకు తీసుకునేలా చేశారు. ఒక జడ్పీటీసి కోసం స్వయాన ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగారంటే ఎంతటి పకడ్బందీ ప్రణాళికతో ఎన్నికల వ్యూహానికి సిద్దమవుతున్నారో చూడొచ్చు. అలాగే గ్రేటర్ ఇంఛార్జీ మైనంపల్లి హన్మంతరావు ఇంటికి కూడా వెళ్లి కేటీఆర్ చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలనీ, వారితో చర్చించి పార్టీలో చేరే విధంగా వారిని ఒప్పించాలని కేటీఆర్ మైనంపల్లికి సూచించినట్టు తెలుస్తుంది. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చేస్తున్న గ్రేటర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రత్యర్ధి పార్టీలకు నిద్ర పట్టకుండా చేస్తుంది.