కొత్త వివాదంలో నకిరేకల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం (వీడియో)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చుట్టూ మరో వివాదం చుట్టుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే దైద సుందరయ్య కొడుకు, జిల్లా పెట్రోలియం బంకు యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు దైద రవీందర్ గత కొంతకాలంగా నకిరేకల్ కేంద్రంగా సోషల్ యాక్టిటీ చేస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు అందివచ్చిన ప్రతి కార్యక్రమాన్ని వాడుకుంటున్నారు. ఎవరైనా బాధితులు తారసపడితే తనవంతు సాయం చేస్తున్నారు.

తాజాగా నకిరేకల్ నియోజకవర్గంలోని ఇనుపాముల అనే గ్రామ శివారులో దైద రవీందర్ కు వ్యవసాయ భూములున్నాయి. అయితే ఆ భూముల్లోకి వెళ్లకుండా ఎమ్మెల్యే వేముల వీరేశం మనుషులు అడ్డంకులు సృష్టిస్తున్నారని దైద రవీందర్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కుటుంబసభ్యులతో సహా దైద రవీందర్ ధర్నాకు దిగారు. దీంతో నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ఈ అంశం చర్చనీయాంశమైంది. దైద రవీందర్ ఏమంటున్నారో కింద వీడియోలో చూడండి.

 

అదంతా ఉత్తదే : ఎమ్మెల్యే వర్గం

ఇదిలా ఉంటే.. గెట్ల పంచాయితీ అనేది ప్రతి గ్రామంలో కామన్ గా ఉండేదేనని, దీనికి ఎమ్మెల్యే వీరేశం ను వివాదంలోకి గుంజడం ఎందుకు అని ఎమ్మెల్యే అనుచరులు ఎద్దేవా చేస్తున్నారు. ఒకవేళ దైద రవీందర్  చెప్పేది నిజమే అయితే కోర్టుకు వెళ్లి న్యాయం పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు దైద రవీందర్ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.