ఏపీ సీఎం వైఎస్ జగన్ వేగంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈసారి తీసుకోబోయే స్టెప్ రాజకీయంగా తనను రెట్టింపు బలవంతుడిని చేసేలా చూసుకుంటున్నారు. ప్రజెంట్ వైఎస్ జగన్ ఎక్కువగా శ్రద్ద పెట్టిన అంశం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తావన పాతదే అయినా ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి వచ్చి రెండు రాష్ట్రాల ప్రజల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ప్రాజెక్టును ఇంతలా ఎలివేట్ చేయడం వెనక వైఎస్ జగన్ పెద్ద వ్యూహమే పన్నినట్టు కనబడుతోంది.
ఈ ప్రాజెక్ట్ కట్టి శ్రీశైలం ద్వారా రోజుకు 3 టీఎంసీల కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువచ్చి తీరుతానని జగన్ ప్రకటించి జీవో నెం 203ను రిలీజ్ చేసేశారు. ఇక్కడే అసలు కథ షురూ అయింది. కేసీఆర్ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదని అడ్డుపడుతున్నారు. భాజాపా కేంద్ర జలవనరుల శాఖ నుండి ప్రాజెక్ట్ పనులు నిలపాలని స్టే తీసుకొస్తే కేసీఆర్ అండ్ కో కృష్ణా రివర్ బోర్డ్ ద్వారా స్టే ఇప్పించారు. ఇక తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే పంపింది. ఇన్ని అడ్డంకులు ఉన్నా జగన్ మాత్రం రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రాజెక్ట్ కట్టి తీరుతానని అంటున్నారు.
ఇప్పటికే వైఎస్ జగన్ రాయలసీమలో మంచి పట్టున్న నేత. అంతేకాక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా బలమైన కేడర్ నిర్మించుకున్నారు. ఈ చరీష్మా ఇంకా పెరగడానికి, రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరును సంపాదించడడానికి ఈ ప్రాజెక్టును తెర పైకి తెచ్చారాయన. పైగా ప్రాజెక్టును కేసీఆర్ అడ్డుకోబోతున్నారని, పెద్ద ఫైట్ జరగనుందని వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. నిజానికి అలాంటివేమీ జరిగే పరిస్థితి లేదు.
కేసీఆర్ మాటల్లో ప్రశాంతత చూస్తే అడ్డుకుంటామనే శబ్ధం తప్ప అడ్డుకోవాలనే నిర్ణయం కనబడటంలేదు. ఈ మాటల యుద్దాలు, సవాళ్లు ప్రతిసవాళ్లు, ఉన్నత స్థాయి సమావేశాలు ఇంకా అనేకం జరుగుతాయి. చివరకు సీమ ప్రయోజనాల కోసం మేము త్యాగం చేస్తున్నాం అంటూ అందరూ చప్పున చల్లారిపోతారు. చివరికి జగన్ ఫేమ్ బాహుబలి లెవల్లో ఎలివేట్ అవుతుంది. గ్రేటర్ రాయలసీమలో ఆయన పేరు ప్రతిష్టలు రెట్టింపువుతాయి. ఇదంతా ప్రీప్లాన్డ్ ప్రాసెస్ అనే అనిపిస్తోంది.
ఇక ఇప్పటికే సీమలో బలహీనంగా ఉన్న టీడీపీ మరింతగా జగన్ గనుక ప్రాజెక్ట్ పూర్తిచేస్తే ఇంకాస్త బలహీనపడుతుంది. అలాగని ఈ అంశంలో వైకాపాతో టీడీపీ పోట్లాడి ప్రాజెక్టుకు మోకాలడ్డే ఆస్కారం లేదు. అలా చేస్తే బాబుకు సీమ ద్రోహి అనే పేరు పడిపోతుంది. అందుకే ఇప్పటివరకు ఏమీ మాట్లాడని ఆయన ఇతర టీడీపీ నేతలు ఇకపై మాట్లాడినా సపోర్ట్ చేయడం తప్ప ఏమీ చేయలేరు. మొత్తం మీద జగన్ వేసిన ఈ ప్లాన్ ఆయనకు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇవ్వనుందనే చెప్పాలి.