ఏపీ, తెలంగాణల జలవివాదం తీరు తెన్ను లేకుండా ఎక్కడి నుండి ఎక్కడికో పోతోంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ఆపాలని కృష్ణా రివర్ బోర్డ్ ముందు తెలంగాణ కంప్లైంట్ పెడితే వైఎస్ జగన్ సర్కార్ అదే కృష్ణా నది మీద కేసీఆర్ కడుతున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో క్రిష్ణా మీద ఇరు ప్రభుత్వాల ప్రాజెక్టులు చర్చల్లోకి వచ్చాయి. సమస్య కృష్ణా జలాల విషయంలో కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు లాంటివి వాలిడ్ పాయింట్స్. వాటిని చర్చకు పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది.
కానీ వైఎస్ జగన్ మాత్రం కృష్ణా నుండి గోదావరికి వెళ్లిపోయారు. గోదావరి నది మీద తెలంగాణ ప్రభుత్వం కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అక్రమేనని, దాన్ని ఆపాలనే వాదనను తెరపైకి తెచ్చారు. అసలు ఈ వాదనలో బలం, లాజిక్ రెండూ లేవు. ఎందుకంటే కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్య అతిధిగా వెళ్లారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అక్రమం అంటున్న ఆయనకు ప్రారంభోత్సవం రోజున అక్రమమని తెలియలేదా అంటున్నారు జనం. ఈ విమర్శ ఏదో చేయాలని చేయడం తప్ప నిలబడే విమర్శ కానే కాదు.
ఇక కాళేశ్వరం పూర్తయ్యే దశలో ఉంది. తెలంగాణా రైతాంగం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే లబ్డిని పొందుతున్నారు. ఇలాంటి సమయంలో నిజంగా ప్రాజెక్ట్ ఆపడానికి వైఎస్ జగన్ ఎన్నేళ్లు ఫైట్ చేసినా ఫలితం ఉండదు. సమస్యను పూర్తిగా విచారిస్తే అసలు గోదావరి జలాల విషయంలో ఎలాంటి గొడవా లేదు. తెలంగాణ ప్రజెంట్ ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఎంత నీటిని వాడుకున్నా రేపు పోలవరం పూర్తై ఏపీ ఎంత పెద్ద మొత్తంలో జలాలను తీసుకున్నా ఇంకా 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూనే ఉంటుంది. కాబట్టి ఎవరి పరిధిలో వారు వాళ్ల వాళ్ల శక్తికి తగ్గట్టు గోదావరి మీద ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా కట్టుకునే వీలుంది. అందులో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
అసలు గోదావరి విషయంలో ఎగువన ఉన్న మహారాష్ట్రతో పైనున్న తెలంగాణకు బాబ్లీ విషయంలో పొరపచ్చాలు ఉండేవి. అవి కూడా కేసీఆర్ చొరవతో దాదాపు దారికొచ్చాయి. అంతేకానీ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు బద్ద శత్రువులుగా మారినా గోదావరి విషయంలో కొట్టుకోవాల్సిన అవసరమే లేనంత అందులో జలాలు పుష్కలంగా జలాలున్నాయి. అలాంటిది వైఎస్ జగన్ ఇప్పుడు తెలంగాణ చేపడుతున్న కాళేశ్వరంతో పాటు శ్రీరామ్ సాగర్ ఇతర ప్రాజెక్ట్స్ అక్రమమని, వాటిని రద్దు చేయాలని అంటుండటం జనం దృష్టిని డైవర్ట్ చేయడానికే తప్ప మరొకటి కాదు.