కాపు ఉద్యమం నుంచి తప్పుకోవడానికి కారణాలు ఇవేనా ?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు కాపులకు బహిరంగ లేఖ రాస్తూ అందులో తాను ఎందుకు తప్పుకుంటున్నాడో కూడా తెలియపరిచాడు. ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారని, ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదని అన్నారు.

అయితే ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు కానీ, పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు కానీ, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోయి మూటలతో కోట్లాది రూపాయిలు, నన్ను నిత్యం విమర్శించే మన సోదరులకు పంచలేదనా? ఈ దాడికి కారణం అని ప్రశ్నించారు.

అయితే తాను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి చంద్రబాబుగారే ముఖ్య కారణమని, మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానని హామీ కోసం అన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని నేను ఏనాడూ అనుకోలేదు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయానని అన్నారు. అయితే కాపు జాతికి మేలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని కూడా చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కాపు రిజర్వేషన్ల అంశం గురుంచి ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ సీఎం జగన్‌కి ముద్రగడ లేఖ కూడా రాశారు. కాపు రిజర్వేషన్ల కోసం, కాపు జాతి అభివృద్ధి కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ముద్రగడ కేవలం తనపై ఆరోపణలు చేస్తున్నారన్న కారణంగా ఉద్యమం నుంచి తప్పుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చానీయాంశంగా మారింది.