కాంగ్రెస్ బతకాలంటే అతనితోనే  సాధ్యం !

కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు గొప్ప ఘన చరిత్ర కలిగిన పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక కాలం పరిపాలించి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన పార్టీ. దాంతో దిక్కుమొక్కు లేకుండా పోయిన పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అడ్రస్ గల్లంతైన పార్టీ. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా… కాంగ్రెస్ పార్టీకి చివరికి తెలంగాణలో కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే కాంగ్రెస్ అధ్వాన స్థితి.. అసలు భవిష్యత్తు పరిస్థితి ఏమిటో అర్ధం కాక అయోమయంలో పడిపోయిన పార్టీ.

అయితే కాంగ్రెస్ కి ఈ దుస్థితి పట్టడానికి ప్రధాన కారణం ఒక్కటే. కాంగ్రెస్ లోని సీనియర్ నేతల్లోని గ్రూపు రాజకీయాలే. దాని వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఎవరికీ వారే వేరుగా ప్రయత్నాలు చేయడంతో 2014 ఎన్నికల్లోనూ ఆ తర్వాత 2018లోనూ కాంగ్రెస్ కు కోలుకులేని దెబ్బ తగిలింది. నాటి నుంచి ఏ ఎన్నిక తీసుకున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఏమాత్రం పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు అనేది వాస్తవం. ఏ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోన్న మాట నిజం.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అలా చేసే నాయకుడు ఎవడు ఉన్నాడు ? కాంగ్రెస్ లోని ఉన్న కొద్దిపాటి నేతలు గ్రూపు రాజకీయాలు, పీసీసీ పదవీ కోసం పాకులాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయడంలేదు. అయితే రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. కాంగ్రెస్ యూత్లోలోనూ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తిమ్మిని బమ్మి చేసే కేసీఆర్ లాంటి నేతను ఎదుర్కోవాలంటే వాగ్దాటి ఉన్న రేవంత్ రెడ్డినే కరెక్ట్ అనే వాదన రోజురోజుకు ఎక్కువతుంది. పైగా కాంగ్రెస్ యూత్ నేతలు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో బతకాలంటే రేవంత్ రెడ్డి నాయకుడిగా రావాలనే అభిప్రాయం బలపడుతుంది.