కరోనా నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్ధీని దృష్ఠిలో ఉంచుకుని వైరస్ వ్యాప్తి నివారణకు టిటిడి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మార్చి 17వ తేదీ నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు విశేష పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవలను టిటిడి రద్దు చేశారు.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ.. స్వామివారి ఆశీస్సులకై శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నారు. ఈ మహాయాగాన్ని మార్చి 19 నుండి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుమలలోని పార్వేటి మండపం వద్ద నిర్వహిస్తారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపనందేంద్ర స్వామివారు, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివార్ల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తారు.
అలాగే కడప ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించాల్సిన శ్రీ సీతారామూల కల్యాణంను ఆలయం వెలుపల రద్దు చేసి ఆలయం లోపల నిర్వహించనున్నారు.