కరివేపాకు బతుకుల్లా  సామాన్యుల బతుకులు !

 
సామాన్యుడి జీవితం కరోనా కాటుకు బలైందన్నది కాదనలేని నిజం. లాక్ డౌన్ తో పేదలు రోడ్డున పడ్డారు. మొత్తం కూలీల బతుకే ఆగమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇదో విషాదకమైన సంఘటన.  పైగా గుండెలు పిండేసేంత హృదయ విదారకమైనది ఏమిటంటే  రోజురోజుకు  ప్రాణాలు పోతున్నాయి.  ఎవరు కారకులు ? ఆ కుటుంబాలకి ఏం న్యాయం జరుగుతుంది ? ఇంత జరిగినా వారి బాధను ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడంలేదు.  కరోనాతో చచ్చినా ఆ చావుకు విలువలేని పరిస్థితి ఎదురైంది.  
 
అసలు ఏ రక్షణలు, ఏ భరోసాలు లేకుండా.. ప్రతి యుద్ధంలోనూ ముందుండేది పోలీసులు.  సమాజంలోని ప్రతి వర్గానికీ అండగా ఉండేది, పోరాడేది, చివరకు తనే గాయపడి, నిశ్శబ్దంగా నిష్క్రమించేది పోలీసే.  కరోనాకి ఆ పోలీసులే బలి అవుతున్నారు.  అయినా రాబోయే రోజుల్లో ఇంకా దుర్దినాలే ఉండబోతున్నాయి. ఇతర రంగాల్లో  కొలువులకు కూడా భద్రత లేదు. జీతాలు కోస్తున్నారు. అసలే అరకొర.. అందులోనూ కోతలు… అసలు నిలబడతామా, బజారున పడతామా..? అని సామాన్యుడి కాలంతో పరుగు  తీయలేక కూలబడిపోతున్నాడు.  వృత్తిపరమైన ఒత్తిళ్లతో అర్ధంతరంగా చావులతో కరివేపాకు బతుకుల్లా సామాన్యుల బతుకులు మారిపోతున్నాయి. 
 
 
కరోనా కల్లోలానికి ఆగమైన ఈ బతుకులకు భరోసా ఏది ? ఆదుకునేవారు  ఎవరివైనా ఉన్నారా ?  ఏ దిక్కూ లేదా.. మరీ మరీ అడిగితే పది కిలోల బియ్యం, అయిదు కిలోల కూరగాయలు పంపిణీతో సరిపెటేస్తారా ?  పుసుక్కున ప్రాణగండం వస్తే…సామాన్యుడికి  బీమా లేదు, ధీమా లేదు… భార్యాబిడ్డలకు దిక్కూ లేదు.  ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎంత దారుణం..?  కనికరించినవారు లేరా  అని సామాన్యుడు ఏడుస్తోన్నాడు.  ప్రభుత్వాలు  ఏదోకటి చెయ్యాలి.