ఏపీకి తమిళనాడు షాక్.. సరిహద్దులో వెలసిన గోడలు!

కరోనా కష్టకాలం నడుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌‌లో చర్యలు అద్భుతం, అమోఘం అంటూ ప్రభుత్వ పెద్దలు రోజుకో స్టేట్ మెంట్ ఇస్తుంటే.. పక్క రాష్ట్రాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌‌తో కలిసే తమ సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నాయి.. రోడ్లపై గోడలు కడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ తమ సరిహద్దు ప్రాంతాలను ఎప్పుడో అలెర్ట్ చేసింది. కర్నూల్ జిల్లా‌తో సరిహద్దును పంచుకునే గ్రామాల్లోకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పోలీసులను మొహరించింది. అలాగే కర్నూల్ నుంచి నిత్యావసరాలు వంటి వాటిని సైతం ఆపేస్తోంది.

తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. అయితే తెలంగాణ కేవలం కంచెలు వేసి, ఆంక్షలు విధించి సరిహద్దుల వద్ద గస్తీ పెడితే.. తమిళ నాడు మాత్రం.. ఏకంగా రోడ్లపైనే గోడలు కట్టేసింది. సాక్షాత్తు వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సరిహద్దులో ఈ పని చేశారు. చిత్తూరుతో కలిపే రెండు మార్గాలలో ఇలా గోడలు నిర్మించి ఏపీ నుండి కరోనా రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగనుందని కూడా తెలుస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను చూసైనా తమ పంథా మార్చుకుని కరోనా కట్టడికి లాక్ డౌన్‌లో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో తెలియాలి.