ఎపిలో కేంద్రం ఇద్దరు నేతలను టార్గెట్ చేస్తోందా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు గురించి సిబిఐ సంస్థ కోర్టులో వాదించిన తీరు పరిశీలించిన వారు కేంద్రానికి వైసిపికి బాగా చెడిందని భావించారు. కేంద్ర సానుకూలంగా వుంటే సిబిఐ ఇంత కఠిన వైఖరి తీసుకోదని భావించడంలో కూడా తప్పు కూడ లేదు. తుదకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రికి ఇంటర్య్వూ కూడా ఇవ్వకుండా అవమానం చేశారని లోకం కోడై కూసింది. .

ఇదిలా వుండగా పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు అంచనాలకు మించి చెల్లింపులు చేశారని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తే అదేమీ లేదని అంతా నిబంధనల ప్రకారం చెల్లింపులు చేశారని చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం ఛత్రం పట్టింది . విద్యుత్ కొనుగోళ్లలో స్కామ్ జరిగిందని తుదకు చంద్రబాబు నాయుడు పై క్రిమినల్ కేసులు బనాయించాలని ముఖ్యమంత్రి తలపెట్టారు. తీరా కేంద్ర ప్రభుత్వం అదేమీ లేదని విద్యుత్ సంస్థలకు విధిగా చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇదంతా చూచిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వుందని అభిప్రాయ పడ్డారు.

ఇప్పుడేమైంది? ఉరుములు లేకుండా పిడుగులు పడ్డట్లు కొన్ని ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు వద్ద పియస్ గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ రావు ఇంట్లో నాలుగు రోజులుగా ఐటి శాఖ దాడులు చేసి పరిశీలన చేస్తోంది. అదే సమయంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంకా మరొక టిడిపి మాజీ మంత్రి కుమారుడు ఇంట్లో సోదాలు నిర్వహించుతున్నారు. పైగా టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ కీ అతి సన్నిహితంగా మెలిగిన రాజేష్ ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. ఇన్నాళ్లూ చంద్రబాబు నాయుడుపై ఈగ వాలకుండా చూచిన కేంద్రం ప్రస్తుతం కొరడా ఝులి పిస్తోంది. ఇతర టిడిపి నేతల ఇళ్లపై జరుగుతున్న సోదాలు దాడులు అంత ప్రాముఖ్యం కలిగి లేవు గాని చంద్రబాబు నాయుడు వద్దనే కొన్ని ఏళ్ల పాటు పని చేసిన అధికారి యింటిపై ఐటి శాఖ దాడి అంటే సాదా సీదాగా భావించేందుకు వీలులేదు. కేంద్రంలోని మోదీ షా ద్వయం రాజకీయ పరమ పద సోపానంలో ఎవరిని నిచ్చెన ఎక్కిస్తారో ఎవరిని పాముల నోట పడేస్తారో అనూహ్యం.

కొస మెరుపు ఏమంటే టిడిపికి చెందిన నేతలకు చిన్న అపకారం జరిగినా వైసిపి తన మీడియాలో హోరెత్తించడం తమ నేతల చేత ప్రకటనల పరంపర సాగించే వారు. కాని ఇంత జరుగుతున్నా వైసిపి మౌనంగా వుండటం అందరికీ ఆశ్చర్యంగా వుంది. దీనికి తోడు టిడిపి నేతల నోళ్లకు తాళంపడింది. కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా ఐటి శాఖ చేత దాడులు సాగించు తున్నదని కనీస ప్రకటన టిడిపి నుండి రాలేదు. అయితే పోలీసు ఉన్నతాధికారి వెంకటేశ్వర రావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు చంద్రబాబు నాయుడు ఖండన ప్రకటన ఇచ్చారు గాని తన పియస్ ఇంటిపై ఐటి దాడులు గురించి ప్రస్తావించక పోవడం గమనార్హం.