తెలంగాణ రాజకీయాల్లోకి సీనియర్ టివి యాంకరమ్మ రాణి రుద్రమ రెడ్డి రాబోతున్నారు. గతంలో ఒకసారి ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనకడుగు వేశారు. కానీ ఈసారి పక్కా వ్యూహంతో రాణి తిరిగి రాజకీయాలు చేసేందుకు స్కెచ్ వేశారు. తెలంగాణ పాలిటిక్స్ లోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న రాణి రుద్రమ రెడ్డి ఏ పార్టీలో చేరతారు? ఆమె ఎంచుకునే ఆప్షన్లు ఏమిటి? చదవండి స్టోరీ.
యాంకర్ రాణి రుద్రమ రెడ్డి టివి న్యూస్ చూసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ జనాలకే కాదు ఆంధ్రా జనాలకు కూడా తెలిసిన మనిషి. తెలంగాణ ఉద్యమ కాలంలో రాణి రుద్రమ టిన్యూస్ సంస్థలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో రాణి రుద్రమ తనవంతు పాత్ర పోశించారు. టిన్యూస్ లో తెలంగాణ ఏర్పాటు కోసం చర్చలు, స్పెషల్ స్టోరీలతో ఉద్యమానికి ఊపిరిలూదారు. అంతకుముందు రాణి రుద్రమ ఈటీవీ, సాక్షి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెళ్లలో పనిచేశారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2010లో తెలంగాణ భవన్ లో టిన్యూస్ ప్రారంభమైంది. ఆ సంస్థలో రాణి అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. అయితే అనతికాలంలోనే టిన్యూస్ సంస్థ పాపులర్ కావడంలో రాణిరుద్రమ శక్తివంచనలేకుండా పనిచేశారు. అయితే ఆమె తదనంతర కాలంలో టిన్యూస్ వదిలేసి డైరెక్ట్ గా క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైసిపి అధినేత జగన్ ఆలోచన మేరకు అప్పుడు తెలంగాణలోని 5 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్న జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసిపి పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి వైసిపి క్యాండెట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆమేరకు జగన్ నుంచి హామీ లభించడమే కాదు టికెట్ల కూడా అనౌన్స్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు.
కానీ అనూహ్యంగా రాష్ట్ర విభజన జరిగిపోయింది. విభజనకు ముందు వైఎస్సార్ సిపి తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరం లేదని ప్రకటించినా.. తర్వాత కట్టర్ సమైక్యవాదం తీసుకుంది. అంతిమంగా తెలంగాణలో దుకాణం మూసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో కీలక నేతలుగా ఉన్న కొండా దంపతులు, కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి లాంటి నేతలంతా వైసిపికి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలోనే వరంగల్ జిల్లా కేంద్రంలో తాను వైసిపిని వీడుతున్నట్లు రాణి ప్రకటించారు. రాజీనామా లేఖను జగన్ కు పంపించేశారు.
వైసిపికి తెలంగాణలో స్థానం లేదని తెలుసుకున్న తర్వాత 2014 ఎన్నికల ముందే టిఆర్ఎస్ కు బద్ధ విరోధులుగా ముద్రపడ్డ కొండా దంపతులు కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిపోయారు. రాణి రుద్రమ తర్వాత కాలంలో ఏ పార్టీలోనూ చేరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మీడియాలోనూ కనిపించలేదు. ఆ సమయంలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. అయితే ఇటీవల హెచ్ఎం టివి నిర్వహించే దశ దిశ కార్యక్రమంతో మళ్లీ మీడియాలోకి వచ్చారు. త్వరలోనే రాణి క్రియాశీల రాజకీయాల్లో బిజీ అవుతారని చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణి రుద్రమ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పోటీ చేస్తారా? లేక గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని ఎంపి లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారా అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి నుంచి పోటీ చేయవచ్చని కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే జన సమితి నేతలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి కలిసి పొత్తు తో పోటీ చేస్తే రాణి రుద్రమ పరిస్థితి ఏంటన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాంటప్పుడు రాణి రుద్రమ ఎంపి స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
రాణి రుద్రమకు టిఆర్ఎస్ కు ఏమాత్రం సఖ్యత లేదన్నది ఈ నాలుగేళ్ళ కాలంలో తేలిపోయింది. ఆమె ఏ కోశాన చూసినా టిఆర్ఎస్ లో చేరే చాన్స్ లేదని చెబుతున్నారు. ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన టిన్యూస్ లో సేవలందించారు. కానీ టిన్యూస్ ను వీడిన తర్వాత టిఆర్ఎస్ రాజకీయాలకు కంప్లిట్ దూరంగా ఉన్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే..? 20 ఏళ్ల క్రితం నల్లగొండ నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి నెలకొల్పిన యువజన సంఘాల సమితిని రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్లు టాక్ వినబడుతున్నది. యువ తెలంగాణ పార్టీ గా ఒకవేళ ఏర్పాటైతే ఆ పార్టీ తరుపున రాణి ఎన్నికల బరిలో ఉండే చాన్స్ ఉందంటున్నారు. అయితే యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినా.. కోదండరాం తెలంగాణ జన సమితితో కలిసే పోటీ చేయవచ్చన్న చర్చ ఉంది. అయితే రాణి నర్సంపేటకు బదులు గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని ఎంపి సీటుకు కానీ ఏదైనా ఎమ్మెల్యే సీటుకు కానీ పోటీ చేయవచ్చని అంటున్నారు.
మొత్తానికి 2019 ఎన్నికల్లో టివి యాంకరమ్మ రాణిరుద్రమరెడ్డి ఎన్నికల బరిలోకి దిగడం మాత్రం ఖాయం అన్నది తేలిపోయింది.
రాణి రాసి, పాడిన బతుకమ్మ పాట అదిరింది
రాణి రుద్రమ రెడ్డి మీడియాను వదిలిన తర్వాత అద్భుతమైన బతుకమ్మ పాటను రాసి పాడారు. అప్పటి వరకు టివీల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఫుల్ లెంగ్త్ బతుకమ్మ పాటలు లేవు. రాణి రుద్రమ రాసి పాడిన బతుకమ్మ పాట జనాల్లో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాతనే అన్ని మీడియా చానెళ్లు, సోషల్ మీడియా లో కూడా ఏటా బతుకమ్మ పండుగ రాగానే పాటలు తయారు చేసి రిలీజ్ చేస్తున్నాయి. రాణి రాసి పాడిన పాట లింక్ కింద ఉంది చూడండి.
[youtube https://www.youtube.com/watch?v=IHR1lNaJ4a4]