రెండోసారి విజయవాడ ఎంపిగా గెలిచిన తర్వాత కేశినేని నాని అంతరంగం తెలుగుదేశంపార్టీ నేతలు ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. రోజు రోజుకు నాని పార్టీకి కొరకరాని కొయ్యలాగ తయారైపోతున్నారు. చివరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును సైతం ధిక్కరిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పార్టీ నేతలు బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
నేరుగా పేర్లు పెట్టి కొందరిని, పేర్లు ప్రస్తావించకుండా మరికొందరిని నాని ఏకిపారేస్తుండంతో పార్టీలో సంచలనంగా మారింది. నాని-బుద్ధా వెంకన్న మధ్య కొద్ది రోజులు జరిగిన ట్వట్టర్ వార్ తో పార్టి పరువు రోడ్డున పడింది. చివరకు చంద్రబాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పిన తర్వాత వెంకన్న వెనక్కు తగ్గాడే కానీ నాని మాత్రం తగ్గలేదు.
అదే సమయంలో పార్టీ సమావేశాల్లో దేనికీ నాని హాజరవటం లేదు. చంద్రబాబు హాజరయ్యే సమావేశాలకు మాత్రమే కాసేపు వచ్చి వెళ్ళిపోతున్నారు. పార్టీ పరంగా చంద్రబాబు ఆర్టికల్ 370 రద్దును సమర్ధిస్తే ఎంపి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక బందర్ పోర్టు కాంట్రాక్టు నుండి నవయుగ సంస్ధను ప్రభుత్వం తొలగిస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై చంద్రబాబు అండ్ కో తీవ్రంగా మండిపడ్డారు. కానీ ఎంపి మాత్రం మద్దతు పలికారు. జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తు ట్విట్టర్లో అభినందనలు తెలపటం నేతలెవరికీ మింగుడుపడలేదు. నాని వ్యవహార శైలితో అసలు ఎంపి అంతరంగం ఏమిటో అంతుపట్టక అవస్తలు పడుతున్నారు.