ఓ ఎంఎల్ఏ వస్తే దేవుడు ఎక్కడైనా మైలపడిపోతాడా ? అవుననే అంటున్నారు తెలుగుదేశంపార్టీ నేతలు. విషయం ఏమిటంటే రాజధాని ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా ఉండవల్లి శ్రీదేవి ఎన్నికయ్యారు. అంటే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం లేండి.
గణేష్ చతుర్ది సందర్భంగా చాలామంది తాము ఏర్పాటు చేసిన గణేషుడి మండపాలకు రావాలని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించటం మామూలే. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మండపానికి రమ్మని శ్రీదేవిని పిలిచారు.
ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేషుడి మండపాలకు వెళ్ళినట్లే ఈ గ్రామానికి కూడా వచ్చారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మండపం దగ్గరకు ఎంఎల్ఏ రాగానే ఒక్కసారిగా గొడవ మొదలైంది. ఎంఎల్ఏల మండపంలోకి అడుగుపెట్టేందుకు వీల్లేదంటూ కొందరు వ్యక్తులు అడ్డు తగిలారు. హఠాత్తుగా మొదలైన గొడవతో ముందు కంగారు పడినా తర్వాత తామే ఎంఎల్ఏను ఆహ్వానించామంటూ కొందరు వ్యక్తులు అడ్డం తిరిగారు. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవైంది.
ఇంతకీ మండపంలోకి ఎంఎల్ఏ రాకూడదని అంటున్న వారి అభ్యంతరం ఏమిటంటే ఎస్సీ ఎంఎల్ఏ గణేషుడి మండపంలోకి వస్తే దేవుడు మైలపడిపోతాడట. చూడబోతే కావాలనే గణేషుడు మండపానికి కులం కార్డు అంటకడుతున్నట్లే కనిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై ఎంఎల్ఏకు షాక్ తగిలినట్లైంది. దాంతో కన్నీళ్ళు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తీరా చూస్తే ఎంఎల్ఏని అడ్డుకున్న వారు టిడిపి నేతలని తేలింది. కులం పేరుతో ఎంఎల్ఏని దూషించిన వారిపై పోలీసులు కేసు పెట్టారు లేండి.