ఇపుడున్న నేతలు పనికిరాని వారా ?

భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలు పనికిరాని వారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిజెపిని వైసిపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీకి భవిష్యత్తు లేదని తేల్చేశారు.

వైసిపికి బిజెపిని ప్రధాన ప్రతిపక్షంగా తీర్చిదిద్దాలంటే ఇప్పుడున్న నేతల వల్ల లాభం లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇపుడు పార్టీలో ఉన్న నేతలతో ప్రతిపక్ష స్ధాయికి ఎదగటం సాధ్యం కాదన్నారు. అందుకనే ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకోవటంపై దృష్టి పెట్టామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి మురళీధర రావు చెప్పిన విషయం పార్టీ నేతల మధ్య అంతర్గతంగా చర్చల్లో ఉన్నదే. కానీ అదే విషయాన్ని మురళి బహిరంగంగా చెప్పటమే కమలం నేతలకు ఇబ్బందిగా మారింది. ఏ నేతైనా తాను పనికిరాని వాడినని బహిరంగంగా ఒప్పుకోరు కదా ? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మురళి ప్రకటనతో నేతల గుట్టు ఒక్కసారిగా బయటపడిపోయింది.

అదే సమయంలో ఇప్పటి వరకూ బిజెపిలో చేరిన నేతలేమన్నా బ్రహ్మాండమైన వారా అంటే కాదు. జనబలం ఉన్న నేతలు ఎవరూ బిజెపిలో చేరలేదనే చెప్పాలి. టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపిల్లో ఒక్కరికి కూడా జనబలం లేదు. అక్కడక్కడ జిల్లాల్లో ఒకరు ఇద్దరు నేతలు చేరినా వాళ్ళల్లో నియోజకవర్గంలో బలమున్న నేతలు తక్కువనే చెప్పాలి. చేరిన వాళ్ళంతా బిజెపిని ఉద్ధరించేద్దామని ఏమీ చేరలేదు. కేసుల భయంతోనో అరెస్టుల భయంతోనో చేరిన వారే అన్న విషయాన్ని మురళీధర రావు గుర్తుంచుకుంటే మంచిది.