తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన మాటను వెనక్కు తీసుకుంది. కరోనా కష్ట కాలంలో పేదలకు ఆహరం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు కోటి చొప్పున రూ.13 కోట్లు మంజూరు చేసి… ఇప్పుడు వాటిని వెనక్కు తీసేసుకుంది.
కోటాను కోట్ల ఆదాయం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం.. కరోనా విపత్తు సయమంలో తన వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, పరికరాల కోసం కోట్లు ఖర్చు చేసింది. తిరుమల, చుట్టు పక్కల ప్రాంతాల్లో వేలాది మంది పేదలకు ఆహారాన్ని అందిస్తోంది. టిటిడి వసతి గృహాల్లో వలస కూలీలకు, నిరుపేదలకు, అనాథలకు ఆశ్రయం కల్పించింది.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వలస కూలీలు, పేదలకు ఆహారం అందించేందుకు రూ.కోటి చొప్పున రూ.13 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ నెల 20 నుండి కొన్ని నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ నిధులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుమల పరిసరాల్లో సైతం కేవలం వలస కూలీలకు మాత్రమే ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టింది. అయితే ప్రభుత్వం నిబంధనలు సడలించినా అన్ని రెడ్ జోన్స్ ప్రాంతాల్లో ఇప్పటికీ వలస కూలీలు, పేదల పరిస్థితి దయనీయంగా ఉంది. వాటిని పరిగణలోకి తీసుకోకుండా టిటిడి ఇలా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు.
ఓ ధార్మిక సంస్థ.. అందునా ధర్మం కోసం పనిచేసే సంస్థ అయిన టీటీడీనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరి ఇతరుల సంగతి ఏంటి? ఓ సారి దీనిపై టీటీడీ పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. పేదలకు ఓ పూటైన కడుపు నిండుతుంది.