ఆ పని చేయగలిగితే జగన్ నిజంగా గ్రేటే

ఆ పని గనుక విజయవంతంగా చేయగలిగితే జగన్మోహన్ రెడ్డిని నిజంగా గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసును బ్యాన్ చేయాలని జగన్ నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు నేతృత్వంలో జగన్ కమిటి వేసిన విషయం అందరికీ తెలిసిందే.

కమిటి తన నివేదికను జగన్ కు అందించారు. ఆ కమిటి సిఫారసు ప్రకారం డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించాలంటే జీతాలు పెంచాలి. నివేదికలోని అన్నీ సిఫారసులకు జగన్ ఆమోదం తెలిపారు. అంటే డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసును జగన్ బ్యాన్ చేయబోతున్నట్లు స్పష్టమైపోయింది.

కమిటి జగన్ తో భేటి అయినపుడు తన నివేదికలోని 100 అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.  అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అంశాల్లోని లోపాలను కూడా ఎత్తి చూపింది. నిజానికి డాక్టర్లతో ప్రైవేటు ప్రాక్టీసును మాన్పించాలని గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ సక్సెస్ కాలేదు.

ఎందుకంటే ప్రభుత్వాసుపత్రుల్లోని సౌకర్యాలు అరాకొరగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా ప్రభుత్వాసుపత్రి అంటేనే జవాబుదారితనం తక్కువగా ఉంటుంది. అందుకనే చాలామంది డాక్టర్లు ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగం చేస్తునే ప్రైవేటు ప్రాక్టీసు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ జగన్ కు తెలుసు కాబట్టే జీతాలు పెంచి ప్రభుత్వ  డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసును బ్యాన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ పని గనుక జగన్ చేయగలిగితే గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే.